ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంత దారి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆమె బీఆర్ఎస్ దారిలో నడవడం లేదు. బీఆర్ఎస్ సపోర్టు తీసుకోవడం లేదు. అసలు ఆ పార్టీ నిర్ణయాలను పట్టించుకోవడం లేదు. తన దారిలో తాను వెళ్తున్నారు. తాజాగా మహిళా రిజర్వేషన్ల అంశానికి సంబంధించి జీవో నెంబర్ 3 మీద శుక్రవారం ధర్నా చేస్తున్నారు. దీనికి బీఆర్ఎస్కు సంబంధం లేదు. జాగృతి పేరు మీదనే నిర్వహిస్తున్నారు.
బీఆర్ఎస్ ఓడిపోయాక కవిత యాక్టివ్ గా ఉన్నారు. దాదాపుగా ప్రతీ రోజూ ఏదో ఓ కార్యక్రమం పేరుతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. సహజంగా కవిత చేస్తున్న కార్యక్రమాలన్నీ బీఆర్ఎస్ కార్యక్రమలే అనుకుంటారు. నిజానికి కవిత బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. సొంతంగా తెలంగాణ జాగృతి పేరు మీదనే ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. బీఆర్ఎస్ పిలుపు మేరకు ఇచ్చిన కార్యక్రమాల్లో పాల్గొనకుండా కేవలం తన సంస్థ వేదికగా వేరే కార్యక్రమాలు నిర్వహిస్తుండటం రాజకీయవర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం పెట్టాలన్న డిమాండ్ ను కూడా కవిత తెరపైకి తెచ్చారు. ఈ డిమాండ్ పూర్తిగా బీఆర్ఎస్కు సంబంధం లేకుండా.. తెలంగాణ జాగృతిపేరు మీదనే నిర్వహించారు. రౌండ్ టేబుల్ సమవేశాలు కూడా నిర్వహించారు. కవిత చేసే రాజకీయం జాగృతి పేరు మీదనే ఉంది. బీఆర్ఎస్ తో సంబంధం లేదన్నట్లగా ఆమె చేస్తున్న రాజకీయం.. ఏదో తేడా ఉందన్న విషయం హాట్ టాపిక్ గా మారింది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిపై విమర్శలు వస్తున్న తరుణంలో బీఆర్ఎస్ చలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ ప్రోగ్రాంకు కవిత వెళ్లలేదు. ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో ఎక్కడా కవిత కనిపించలేదు. ఇదే సమయంలో చిన జీయర్ స్వామితో భేటీ అయ్యారు.