సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న సభలను అనుకున్న సమయానికి నిర్వహించడానికి వైసీపీ తంటాలు పడుతోంది. ప్రతీ సభను రెండు, మూడు సార్లు వాయిదా వేసుకుంటూ వస్తోంది. తాజాగా చివరి సిద్ధం సభను… గత నెలలోనే నిర్వహిస్తామని ప్రకటించారు. ఇప్పుడు తేదీలకు తేదీలు మార్చుకుంటూ వస్తున్నారు. ఈ నెల పదో తేదీన నిర్వహించాలనుకుంటున్న సిద్ధ సభపై.. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుల ఎఫెక్ట్ పడినట్లుగా కనిపిస్తోంది. మరో తొమ్మిది రోజులు వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
అద్దంకి దగ్గర ఏర్పాట్లను సభ కోసం ఇప్పటికే పూర్తి చేశారు. పదిహేను లక్షల మంది వస్తారంటూ.. విజయసాయిరెడ్డి రెండు రోజులకో సారి మీడియాను పిలిచి చెబుతున్నారు. కానీ పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో 19వ తేదీకి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. చివరి సిద్ధం సభలోనే అభ్యర్థుల ప్రకటన.. మేనిఫెస్టోను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కానీ ఇప్పటికీ ఆ కసరత్తు కూడా పూర్తి కాలేదు. డబ్బుల్లేక చేయూత బటన్ నొక్కినా పధ్నాలుగు రోజుల పాటు అకౌంట్లలో పడతాయని కథలు చెబుతున్నారు. చాలా పథకాలకు డబ్బులు పెండింగ్ లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో కొత్త పథకాలు ప్రకటిస్తే నవ్వుల పాలవుతారని తెలుసు. అందుకే మోడీ దగ్గరకు వెళ్లి హామీ తీసుకుని వచ్చి ప్రకటన చేయాలనుకున్నారు..కానీ అదీ సాధ్యం కావడంలేదు.
జగన్ ఎన్నికల ప్రచారం కూడా తేలిపోతోంది. విపక్షాలు జోరుగా ప్రజల్లోకి వెళ్తూంటే.. బటన్ నొక్కుడు సభల్లో … విపక్షాలపై ఏడవడానికే జగన్ కు సమయం సరిపోతోంది. ఎన్నికల షెడ్యూల్ మరో వారం రోజుల్లో రానుంది. ఆ తర్వాత నెల రోజుల్లోనే పోలింగ్ ఉంటుంది. ఈ లోపు ఆయన ముప్పై నియోజకవర్గాలను అయినా కవర్ చేస్తారా లేదా అన్నది సందేహంగా మారుతోంది.