బీజేపీ 195 మందితో తొలి జాబితా విడుదల చేసి దాదాపుగా వారం అవుతోంది. తీరిగ్గా కాంగ్రెస్ 39 మందితో మొదటి జాబితా రిలీజ్ చేసింది. అందులో రాహుల్ గాంధీ పేరు వయనాడ్ నుంచి ఖరారు చేశారు. తెలంగాణ నుంచి అతి కష్టం మీద నలుగురు పేర్లు ఫైనల్ చేశారు. ఇందులో నల్గొండ నుంచి జానారెడ్డి కుమారుడికి సీటిచ్చారు. ఇప్పటికే ఓ కుమారుడికి ఎమ్మెల్యే సీటిచ్చారు. మరో కుమారుడికి ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. గత రెండు ఎన్నికల్లో టిక్కెట్ పేరుతో పటేల్ రమేష్ రెడ్డికి సూర్యాపేట టిక్కెట్ ఇవ్వకుండా హ్యాండిస్తూనే ఉన్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలిచే సత్తా ఉన్న పటేల్ రమేష్ రెడ్డి.. మొన్న ఎన్నికల్లో పోటీకి సిద్ధమైతే లోక్ సభ టిక్కెట్ ఇస్తామని చెప్పి బుజ్జగించారు.
చివరికి వారసుడికే ప్రాధాన్యం ఇచ్చారు. ఇక వంశీచంద్ రెడ్డికి మహబూబ్ నగర్, మహబూబాబాద్ టిక్కెట్ ను పోరిక బలరామ్ నాయక్ జహీరాబాద్ టిక్కెట్ ను సురేష్ షెట్కార్ కు కేటాయించారు. సురేష్ షెట్కార్ కు అసెంబ్లీ టిక్కెట్ కేటాయించి వెనక్కి తీసుకోవడంతో చాన్సిచ్చారు. ఇక మరే పేరును ఖరారు చేయలేదు. మొదట ఓ జాబితా లీక్ అయింది. అందులో చేవెళ్ల అభ్యర్థిగా సునీతా మహేందర్ రెడ్డి పేరు ఉంది. కానీ అసలు జాబితాలో ప్రకటించలేదు. తొమ్మిది నుంచి పదమంది కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ కేవలం నాలుగు పేర్లతో సరి పెట్టారు.
కాంగ్రెస్ జాబితాల్లో గెలుపు అవకాశాల కన్నా అంతర్గత రాజకీయాల ప్రభావమే ఎక్కువగా కనిపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. గెలిచే బలమైన నేతల్ని కాకుండా.. పార్టీ నేతల ఒత్తిడి మేరకు.. ఎవరి బలం ఉంటే.. వారు సిఫారసు చేస్తున్న పేర్లను ఖరారు చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. హైకమాండ్ దగ్గర పలుకుబడి ఉంటే.. టిక్కెట్ తెచ్చుకోవచ్చన్నట్లుగా మారింది.