విశ్వక్సేన్ ‘గామి’ అనే సినిమా చేస్తున్నాడన్న సంగతి ఫిల్మ్ సర్కిల్స్‌లో చాలామందికి తెలీదు. ఎప్పుడో ఏడెనిమిదేళ్ల క్రితం మొదలైన సినిమా ఇది. మధ్యలో ఆగుతూ.. సాగుతూ రిలీజ్ వరకూ వచ్చింది. రిలీజ్‌కి పది రోజుల ముందే ప్రమోషన్స్ మొదలెట్టారు. ‘ఇది రెగ్యులర్ సినిమా కాదు.. కమర్షియల్ హంగులు ఉండవు’ అని ఆడియన్స్‌ని ప్రిపేర్ చేశారు. కానీ లోపల ఒక బెంగ ఉండేది. విశ్వక్సేన్ సినిమాల్లో ఉండే ఎనర్జీ, సినిమాటిక్ హంగులూ ఈ సినిమాలో లేవు. కాబట్టి… ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకొంటారో అనుకొన్నారు. పైగా.. సినిమా బాగా లేట్ అయ్యింది. ‘అవుట్టేడెట్ ప్రొడక్ట్’ అనుకొంటారన్న భయాలూ వెంటాడాయి. క్లాస్ సినిమాకి టికెట్లు తెగుతాయో లేదో అనే అనుమానాలు మరో వైపు.
అనుకొన్నట్టే ‘గామి’ విడుదలైంది. క్రిటికల్ గా మంచి స్పందన వచ్చింది. రివ్యూలూ, రేటింగులు బాగున్నాయి. అదృష్టవశాత్తూ ఓపెనింగ్స్ కూడా కుదిరాయి. విశ్వక్సేన్ ఓ కమర్షియల్ సినిమా చేస్తే ఎంత ఓపెనింగ్ వస్తుందో, ఈ ‘గామి’కి అంత వచ్చింది. తొలి రోజు దాదాపు రూ.9 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని చిత్రబృందం చెబుతోంది. శనివారం కూడా బుకింగ్స్ బాగున్నాయి. ఈ వారం విడుదలైన సినిమాల్లో `గామి`కి మంచి టాక్ ఉంది. కాబట్టి వీకెండ్ క్యాష్ చేసుకొనే అవకాశం ఉంది. ఈ జోరు కొనసాగితే.. కమర్షియల్ గానూ ‘గామి’ గట్టెక్కిపోతోంది. ఓ ప్రయోగాత్మక చిత్రం, విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం.. వసూళ్ల పరంగానూ ముందుంటే ఆ సంతృప్తి వేరు.