ఏపీలో పొత్తులపై స్పష్టత వచ్చింది. టీడీపీ ఎన్డీఏలో చేరింది. ఈ సందర్భంగా రెండు రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగా జనసేన, బీజేపీకి కలిపి 30 అసెంబ్లీ, ఎనిమిది పార్లమెంట్ సీట్లను కేటాయించారు. ఇందులో ఆరు బీజేపీ పోటీ చేస్తుంది. రెండింటిలో జనసేన పోటీ చేస్తుంది. ఉదయం పదకొండు గంటల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అమిత్ షాతో సమావేశం అయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు ఏపీ రాజకీయాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ప్రధానంగా చర్చ కొనసాగింది. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య అవగాహన కుదిరిన తర్వాత అలాగే ఎన్డీఏలోకి టీడీపీని బీజేపీ ఆహ్వానించింది.. ఈ నెల 14వ తేదిన జరిగే ఎన్డీఎ సమావేశానికి చంద్రబాబును హాజరుకావాల్సిందిగా అమిత్ షా కోరారు.
నేషనల్ డెమెక్రటిక్ అలయెన్స్ లోకి టీడీపీ చేరిక ప్రకటన ఏ క్షణమైనా రానుంది. రెండు విడతలుగా ఢిల్లీలో జరిగిన చర్చల్లో ఈ అంశంపై స్పష్టత వచ్చింది. టీడీపీ పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో , బీజేపీ ఆరు స్థానాల్లో, జనసేన రెండు లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనున్నారు. జనసేన రెండు స్థానాలు కాకినాడ, మచిలీపట్నంగా ఖరారయ్యాయి. అనకాపల్లి కూడా జనసేనకే రావాల్సి ఉన్నా.. బీజేపీ ఒత్తిడితో ఆ పార్టీకి కేటాయించారు.
రాజంపేట, ఏలూరు, అనకాపల్లి, రాజమండ్రి, అరకు, హిందూపురం నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయనుంది. మిగిలిన నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థులు బరిలో ఉంటారు. ఇక అసెంబ్లీ స్థానాల్లోనూ లెక్క కుదిరింది. బీజేపీ, జనసేనకు కలిసి 30 నియోజకవర్గాలు కేటాయించారు. ఇందులో ఇరవై నాలుగు జనసేన, ఆరు బీజేపీ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఆ ఆరు నియోజకవర్గాలు ఏమిటేమిటి అన్నదానిపై రాష్ట్ర స్థాయిలో చర్చించి ఖరారు చేసుకుంటారు.