రావెల సుశీల్ ఒక ముస్లిం మహిళతో అసభ్యంగా ప్రవర్తించినందుకు జైలుపాలయిన తరువాత, అతని తండ్రి మంత్రి రావెల కిషోర్ బాబు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మాటల వలన తెదేపా ప్రభుత్వానికి ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసివచ్చింది. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి రావెలపై కోప్పడ్డారు కూడా. ఈ అంశంపై వైకాపా శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం కూడా ఉంది కనుక దానికి ఏవిధంగా జవాబు చెప్పుకోవాలాని తెదేపా ఆలోచిస్తుంటే తెదేపాకే చెందిన జెరూసలెం మత్తయ్య రావెల కిషోర్ బాబుకి మద్దతు ప్రకటిస్తున్నట్లుగా వ్యవహరించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.
మంత్రి రావెల, ఆయన కుమారుడిపై అసత్య కధనాలు ప్రచురించినందుకు సాక్షి మీడియాపై, జగన్ మరియు వైకాపా నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన రాష్ట్ర ఎస్సీఎస్టీ కమీషన్ కి పిర్యాదు చేశారు. వైకాపాను ఎదుర్కోవడానికి అది కూడా తెదేపా వ్యూహంలో భాగం అనుకోవాలా లేక తెదేపా అధిష్టానానికి తెలియకుండానే మత్తయ్య ఇందుకు పూనుకొన్నారని అనుకోవాలా? ఒకవేళ తెదేపాలో వ్యూహంలో భాగంగానే మత్తయ్య ఆవిధంగా పిర్యాదు చేసారంటే, దానర్ధం తెదేపా ప్రభుత్వం మంత్రి రావెల కిషోర్ బాబుని ఆయన కొడుకు సుశీల్ ని వెనకేసుకువస్తున్నట్లు భావించాల్సి ఉంటుంది.
ఒకవేళ తెదేపా అధిష్టానానికి తెలియకుండా మత్తయ్య ఈ పిర్యాదు చేసి ఉండి ఉంటే, ‘మంత్రి రావెలని, సుశీల్ ని ప్రభుత్వం వెనకేసుకు వస్తోందా?’ అని శాసనసభలో వైకాపా నిలదీస్తే దానికి జవాబు చెప్పుకోలేక తెదేపా ప్రభుత్వం చాలా ఇబ్బందిపడవచ్చును. ఇంతకీ మత్తయ్య ఎవరి ప్రోద్బలంతో సాక్షి మీడియా, వైకాపా నేతలపై రాష్ట్ర ఎస్సీఎస్టీ కమీషన్ కి పిర్యాదు చేసారో? తెలియాల్సి ఉంది.
రాజధాని ప్రాంతంలో కొన్ని గ్రామాల రైతులు తమ భూముల అమ్మకాల గురించి సాక్షి మీడియాలో అసత్య కధనాలు ప్రచురిస్తునందుకు దానిపై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. వారు స్థానిక తెదేపా నేతల ప్రోద్బలంతోనే ఆపని చేసారని తెలుస్తూనే ఉంది. కానీ ఆ విషయంలో తెదేపా చాలా వ్యూహాత్మకంగానే పావులు కదిపినట్లే చెప్పవచ్చును. కానీ రావెల కిషోర్, సుశీల్ విషయంలో మత్తయ్య చేసిన పనికి బెడిసికొట్టే అవకాశం కనిపిస్తోంది.