టీడీపీ, జనసేనలతో బీజేపీ జత కట్టింది. గట్టిగా ఒక్క శాతం ఓట్లు లేని బీజేపీకి ఆరు పార్లమెంట్ సీట్లు ఐదారు అసెంబ్లీ సీట్లు దక్కనున్నాయి. పూర్తిగా ఇతర పార్టీల బలం మీదనే ఆధారపడి వీరు గెలవాల్సి ఉంటుంది. సొంతంగా బూత్ ఏజెంట్లనూ పెట్టుకునే పరిస్థితి ఉండదు. అందుకే అభ్యర్థుల విషయంలోనూ.. టీడీపీ,జనసేన అభిప్రాయాలకు బీజేపీ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రకారం చూస్తే.. ప్రో వైసీపీ బ్యాచ్ నేతలకు ఒక్క చోట కూడా అవకాశం దక్కే అవకాశాలు కనిపించడం లేదు.
అధికారపక్షంలో ఉన్నప్పటికీ వైసీపీ పై కాకుండా .. ప్రతిపక్షం టీడీపీపై పోరాడారు… సోము వీర్రాజు నేతృత్వంలోని ఓ వర్గం. ఇప్పుడు వారిలో చాలా మంది పొత్తులు అనగానే టిక్కెట్ల కోసం పరుగులు పెడుతున్నారు. పెద్ద పెద్ద నేతలతో లాబీయింగ్ చేయించుకుంటున్నారు. కానీ సోము వీర్రాజు, జీవీఎల్ సహా… ఎవరికీ అవకాశాలు దక్కే సూచనలు కనిపించడం లేదు. హిందూపురంలో విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నప్పటికీ అక్కడ కూడా బయట నుంచి సత్యకుమార్ లేదా పరిపూర్ణానంద పేరును తెరపైకి తెస్తున్నారు.
వైసీపీపై పోరాడిన వారికి మాత్రం అవకాశాలు లభించనున్నాయి. పురందేశ్వరి రాజమండ్రి నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ సీటు కోసం టీడీపీ ఇంత వరకూ ఎలాంటి కసరత్తు చేయలేదు. బీజేపీకి ఇచ్చే ఉద్దేశంతోనే ఉన్నారని అర్థమవుతోంది. అనకాపల్లికి సీఎం రమేష్ , ఏలూరుకు సుజనా చౌదరి పేర్లు పరిశీలనకు వస్తున్నాయి. వైసీపీతో కలిసిపోయిన నేతలకు అవకాశాలు ఇచ్చినా … పూర్తిగా వారికి ఓట్లు వేయాల్సింది టీడీపీ, జనసేన నేతలేనని… వారు వేయరన్న ప్రధాన కారణంతోనే ఎవరికీ అవకాశాలు ఇవ్వడం లేదని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.