సిద్ధం.. సిద్ధం అంటూ.. కనీసం ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సభలు నిర్వహించారు. కానీ ఏం సిద్ధమయ్యారో మాత్రం చెప్పలేదు. అందరి కంటే ముందే ఎన్నికలకు రెడీ అయ్యామని చెప్పుకునేందుకు ఈ సభలు పెట్టారు. పట్టుమని పది మంది అభ్యర్థులను కానీ.. మేనిఫెస్టోను కానీ ప్రకటించలేకపోయారు. చివరి సిద్ధం సభలో అభ్యర్థుల్ని మేనిఫెస్టోను ప్రకటిస్తామని ప్రచారం చేశారు. ఆ సభలోనూ తాము సిద్ధం కాలేదని నిరూపించేశారు.
వైఎస్ఆర్సీపీ పూర్తి గందరగోళంలో ఉంది. ఒక్క నిర్ణయాన్ని పూర్తిగా తీసుకోలేకపోతున్నారు. అభ్యర్థుల విషయంలోనే అటూ ఇటూ మారుస్తున్నారు. ఎవరు ఎక్కడ పోటీ చేయాలన్నది .. జాబితా జాబితాకు మారిపోతోంది. అభ్యర్థిత్వం ఖరారు చేసిన వారిలో కొంత మంది తప్ప ఎక్కువ మంది యాక్టివ్ గా లేరు. ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు అందరికీ తాయిలాలు పంచాలని ఆదేశాలిస్తే.. గత ప్రభుత్వంలో సంపాదించుకున్న అతి కొద్ది మంది మాత్రమే యాక్టివ్ గా ఆ పని చేస్తున్నారు. మిగిలిన వాళ్లు ఏదో చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.
పార్టీ యంత్రాంగం పూర్తి స్థాయిలో నిర్వీర్యమైపోయిందని.. వారు ఎన్నికల్లో వైసీపీకి పని చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తేలడంతో.. వచ్చే ప్రభుత్వం రాగానే.. అన్నీ చేస్తామంటూ కబుర్లు ప్రారంభించారు. కానీ ఐదేళ్లలో చేయలేదు.. మళ్లీ ప్రభుత్వం వస్తే బిల్లులు ఇస్తారన్న నమ్మకం వారికి ఉండటం లేదు. అప్పులు.. తాకట్టులు పెట్టేవి ఏవీ లేవు. సంపద సృష్టించే లక్షణాలేమీ లేవు కాబట్టి మళ్లీ గెలిస్తే అసలు ఇస్తారన్న నమ్మకం పెట్టుకోవడం లేదు.
అంటే .. పార్టీ అభ్యర్థుల నుంచి పార్టీ క్యాడర్ బిల్లుల చెల్లింపు వరకూ దేనికీ జగన్ సిద్ధం కాలేదు. కానీ ప్రతిపక్ష నేతలు, మీడియాను తిట్టడానికి ఆయన ఎప్పుడూ సిద్ధమే. కానీ దాని వల్ల ప్రజలకు ఒరిగేదేంటి ?. వైసీపీకి వచ్చే లాభమేంటి ?