కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో పాటు ఒడిషా ఎంపీ బైజయంతి పండా విజయవాడలో మకాం వేశారు. పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి వచ్చి నేరుగా హోటల్ కు వెళ్లి వారిని కలిశారు. ఏం చర్చలు జరిపారో చెప్పలేదు. తర్వాత చెబుతామని పవన్ కల్యాణ్ అన్నారు. అయితే బీజేపీ ఏదో విషయంలో పవన్ పై ఒత్తిడి తెస్తుందన్న విషయం మాత్రం జనసేన వర్గాలకు క్లారిటీ వచ్చింది.
ఇప్పటికే పార్లమెంట్ సీటును బీజేపీకి పవన్ త్యాగం చేశారు. ఇప్పుడు మరో రెండు అసెంబ్లీ సీట్లను కూడా అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. పవన్ ఇచ్చిన ఇరవై నాలుగు సీట్లలో రెండు సీట్లను బీజేపీకి కేటాయించాలని అడుగుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ ను.. ఎంపీగా పోటీ చేయాలని కూడా బీజేపీ ప్రతిపాదిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఎంపీగా గెలిస్తే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రితో సమానమైన కేంద్ర మంత్రి పదవి వస్తుందని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. కానీ పవన్ కల్యాణ్ ఇప్పటి వరకూ ఎంపీగా పోటీ చేయడం అన్నదానిపై ఆలోచన చేయలేదు.
బీజేపీ, పవన్ చర్చలు సోమవారం కూడా జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ మార్చి పదో తేదీన వచ్చింది. ఆ తేదీ దాటిపోవవడంత ఏ క్షణమైనా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఎన్నికల సంఘం జమ్మూకశ్మీర్ లో ఎన్నికల ఏర్పాట్ల పర్యవేక్షణకు వెళ్లింది. అక్కడి ఏర్పాట్లపై సమీక్షలు పూర్తయ్యాక… ఒక్క రోజులోనే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఈ లోపే… తమ సీట్లు.. అభ్యర్థులను ఫైనల్ చేసుకోవాలని పార్టీలు ఓ నిర్ణయానికి వస్తున్నాయి.