బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు చేస్తుండంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇందిరమ్మ రాజ్యాన్ని కాపాడుకునేందుకు మద్దతు ఇస్తామని తనతో చెబుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. భద్రాచలం బహిరంగసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్నేళ్లు తాము బీఆర్ఎస్లో పార్టీలో ఉన్నా గతంలో ఒక్కరోజు ముఖ్యమంత్రిని కలవలేదని, ఆయన తమ మాట వినలేదని, ఆయన ఎట్ల ఉన్నడో తాము చూడలేదని వారు వాపోయారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మంత్రులు సచివాలయంలో ఉంటున్నారని, ముఖ్యమంత్రిని ఇంటి దగ్గర, సచివాయంలో పేదలు, కార్యకర్తలు, ఆడ బిడ్డలను కలుస్తున్నారని బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారన్నారు.
ముఖ్యమంత్రి అధికారులను కలుస్తూ సమీక్షలు చేస్తూ అభివృద్ధి చేస్తున్నందున, అయిదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత తమదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనను కలిసి చెబుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఒక వేళ తాను గేట్లు తెరిస్తే కేసీఆర్, ఆయన కొడుకు, అల్లుడు తప్పితే బీఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్ జెండా కప్పుకొనిఇందిరమ్మ రాజ్యానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారని ముఖ్యమంత్రి అన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు తమకు మద్దతుగా నిలిచారని ముఖ్యమంత్రి తెలిపారు. తాము మర్యాదపూర్వకంగా, నైతికతతో కూడిన రాజకీయాలు చేయాలనుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మోదీ, కేడీ కలిసి కుట్రలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. తమకు లోతు, ఎత్తులు తెలుసని, ఏం చేయాలో తెలుసని వ్యాఖ్యానించారు. తాము అల్లాటప్పాగా రాలేదని, నల్లమల్ల నుంచి తొక్కుకుంటూ వచ్చి ప్రగతి భవన్ బద్దలుకొట్టి కేసీఆర్ను బజారుకు ఈడ్చి ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. తమతో గోక్కోవద్దు.. గోక్కొన్నవాడెవడూ బాగుపడలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారను. చాలామంది ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎక్కడ ఉందన్నారని, మణుగూరు వచ్చి చూస్తే కాంగ్రెస్ ఎక్కడ ఉందో తెలుస్తుందన్నారు.