‘ధమాకా’ లాంటి సూపర్ హిట్ తరవాత నక్కిన త్రినాథరావు నుంచి సినిమాలేం పట్టాలెక్కలేదు. మధ్యలో చాలామంది హీరోల పేర్లు వినిపించాయి,. కానీ ఏదీ ఖరారు కాలేదు. ఇన్నాళ్లకు ఓ హీరోని ఫిక్స్ చేసుకొన్నాడు. తనే సందీప్ కిషన్. వీరిద్దరి కాంబోలో ఓ సినిమా రాబోతోందని కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, లాస్య మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. సందీప్‌కి ఇది 30వ చిత్రం. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందిస్తున్నారు. త్రినాథరావు, ప్రసన్నకుమార్ అనగానే పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రాలే గుర్తొస్తాయి. ఇది కూడా ఆ జోనర్లో సాగే కథే అని తెలుస్తోంది. ‘ఊరి పేరు భైరవకోన’ తరవాత సందీప్ చేస్తున్న సినిమా ఇది. ‘ఓరి నాయినోయ్’ అనే పేరు ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.