వైసీపీలో సీట్ల కుమ్ములాటల్లో కోట్ల కొద్దీ వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా చిలుకలూరిపేట ఇంచార్జ గా ఇటీవల నియమించిన మల్లెల రాజేష్ నాయడు అనే నేత పార్టీ కార్యకర్తల సమావేశం పెట్టి.. విడదల రజనీపై తీవ్ర ఆరోపణలు చేశారు. విడదల రజనీ తన దగ్గర ఆరున్నర కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. తనను రజనీ మోసం చేసిన విషయంపై .. సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరకు వెళ్తే మూడు కోట్లు మాత్రమే ఇచ్చారని.. మిగతా మూడన్నర కోట్లు నొక్కేశారని ఆయన అంటున్నారు.
విడదల రజనీని గుంటూరుకు బదిలీ చేసిన తర్వాత అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఆయనేనంటూ మల్లెల రాజేష్ ను నియమించారు. ఇలా చేసినందుకున రజనీకి డబ్బులిచ్చానని..చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఆయనను తప్పించబోతున్నారు. ఆర్థికంగా చాలా వీక్ గా ఉన్నాడని పుల్లారావు ను తట్టుకోలేడని ఆయనను తప్పించాలని డిసైడయ్యారు. కొత్త వ్యక్తిని సిద్ధం చేశారు. ఇది తెలియడంతో.. తనను ఆర్థికంగా దోచేసి.. ఇప్పుడు ఆ కారణంగానే టిక్కెట్ లేదంటున్నారని ఫైర్ అవుతున్నారు.
తనకు కాకపోతే మర్రి రాజశేఖర్ కు టిక్కెట్ ఇవ్వాలని కాదని మరొకరికి ఇస్తే .. ఓడిస్తామని అంటున్నారు. మల్లెల రాజేష్ నాయుడు వ్యవహారం చూసిన వారంతా పాపం అంటున్నారు. ఆయన గతంలో పుల్లారావు శిష్యుడిగా టీడీపీలో ఉండేవారు. చేయాల్సిన దందాలు చేసి.. సంపాదించుకున్న తర్వాత గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆ సంపాదన అంతా.. రజనీతో పాటు వైసీపీ ఖర్చు పెట్టేయించి.. ఇప్పుడు టిక్కెట్ లేదని అంటున్నారు. గుంటూరు మేయర్ గా ఉన్న కావటి మనోహర్ నాయుడుని అభ్యర్థిగా ఎంపిక చేస్తారని వైసీపీలో ప్రచారం జరుగుతోంది.
విడదల రజనీ వసూళ్లపై అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. మల్లెల చేసిన ఆరోపణలు మాత్రం బహిరంగంగా తొలి సారి. ఈ ఇష్యూలో సజ్జల పేరునూ ప్రస్తావించడం.. వైసీపీలో జరుగుతున్న పరిణామాలకు అద్దం పడుతోందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.