వైసీపీలో వరుసగా విడుదలవుతున్న జాబితాల మీద జాబితాల వెనుక భారీ స్కామ్ ఉందన్న గుసగుసలు గట్టిగానే వినిపస్తున్నాయి. ఇప్పటి వరకూ ఒక జాబితాలో ఉన్న వారిని మరో జాబితాలో తీసేస్తున్నారు. మరికొంత మందికి అసలు అభ్యర్థిత్వాలు ఉండవని.. చివరి క్షణంలో ఇతరులు వస్తారని సంకేతాలు ఇస్తున్నారు. దానికి ఏదో ఓ కారణం చెబుతున్నారు. అనుకున్నట్లుగా పని చేయలేకపోతున్నారు తీసేస్తున్నామని చావు కబురు చల్లగా చెబుతున్నారు. అప్పటికే నేతలు సమర్పించుకున్నది కాక.. ఫ్లెక్సీలకు ఇతర ఖర్చులకు ఆస్తులు అమ్మేసుకుని ఉంటారు నేతలు. ఇలాంటి వారు రోజు రోజుకు పెరిగిపోతున్నారు.
చిలుకలూరిపేటలో మల్లెల రాజేష్ నాయుడ్ని అనే నేతకు ఇంచార్జ్ ఇచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఇప్పుడు అలా ఆశ్చర్యపోయిన వారి మైండ్ బ్లాంక్ చేసేశారు. ఎందుకంటే.. ఆయనకు కనీసం ఇరవై కోట్లు చిలుం వదిలించేశారని తేలిపోయింది. తనకు జరిగిన అన్యాయంపై ఆయన కార్యకర్తల సమావేశం పెట్టుకుని ఏడ్చినంత పని చేశారు. ఇక బయటకు రాలేక ఇంట్లో ఏడుస్తున్న వైసీపీ నేతలకు లెక్కలేదు. ఇప్పటి వరకూ పన్నెండు జాబితాలను విడుదల చేశారు. మార్చిన వాళ్లనే మళ్లీ మళ్లీ మారుస్తున్నారు. ఆర్థికంగా బలమైన వాళ్లు అని చెప్పి సీటిస్తున్నారు. తర్వాత తీసేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహాంలో కోట్లు చేతులు మారుతున్నాయి. అంతా బ్లాక్ మనీ కావడంతో ఎవరూ ఫిర్యాదులు వరకూ వెళ్లలేకపోతున్నారు.
సొంత పార్టీ నేతల్ని దోచుకుని.. ఏం సాధిస్తారన్న చర్చ వైసీపీలో నడుస్తోందగి. ఓ వైపు జాబితాల పేరుతో గందరగోళం సృష్టించుకుని పార్టీ రేసులో లేదన్న అభిప్రాయాన్ని బల పర్చుకున్నారు. మరోవైపు పార్టీనేతలను ఆర్థికంగా కుంగదీస్తున్నారు. క్యాడర్ ను పట్టించుకోవడం లేదు. .ఎలా చూసినా.. వైసీపీ నేతలే దోపిడీదారులనుకుంటే వారినే దోపీడీ చేస్తున్న వైనం సంచలనంగా మారుతోంది.