బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రత్యేకంగా 30 మంది టీముని పెట్టుకుని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలన్నింటినీ నడిపిన డీఎస్పీ ప్రణీత్ రావు లీలలపై పోలీసులు ఇస్తున్న లీకులు రాజకీయ వర్గాలనే కాదు. బీఆర్ఎస్ కీలక నేతల్ని కూడా నోరెళ్లబెట్టేలా చేస్తున్నాయి. కేసీఆర్కు ఎప్పుడూ వెన్నంటి ఉండే సంతోష్ రావు భార్య ఫోన్ ను కూడా ప్రణీత్ రావు టీం హ్యాక్ చేసిందని గుర్తించినట్లుగా… ప్రముఖ ఇంగ్లిష్ దినపత్రిక తెలిపింది. విచారణలో చాలా వరకూ ప్రణీత్ రావు నోరు తెరవకపోయినప్పటికీ.. డాటా మొత్తం రీట్రీవ్ చేసే క్రమంలో వెలుగులోకి వస్తున్న అంశాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
సంతోష్ రావు కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. ఎంతగా ఉంటే.. కేసీఆర్ ఫోన్లను ఆయనే మెయిన్ టెయిన్ చేస్తారు. తననే అంటి పెట్టుకుని ఉంటారు కాబట్టే.. టైంకు మందులు ఇస్తారని రాజ్యసభ సీటు ఇచ్చారని కూడా గతంలో కేసీఆర్ చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. అంత కంటే ముందు ఆయన కేసీఆర్ సోదరి కుమారుడు. మొదటి నుంచి కేసీఆర్ పిల్లలతోనే పెరిగారు. అలాంటిది ఆయన ఫోన్ ను ట్యాప్ చేశారు. ఎవరో చెప్పకపోతే ఫోన్ ట్యాప్ చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ముఖ్యుల నుంచి వచ్చిన సూచనల మేరకే సంతోష్ రావు ఫోన్ ను కూడా ట్యాప్ చేసినట్లుగా అనుమానిస్తున్నారు.
సంతోష్ రావు పేరు మొదట్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వినిపించింది. ఆ తర్వాత మరికొన్ని వివాదాల్లోనూ పేరు బయటకు వచ్చింది. ఇటీవల ధరణి భూముల విషయంలో ఆయన అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లుగా బయటపడింది. ఈ వివాదాలు వచ్చిన సమయంలో ఆయన కొంత కాలం ప్రగతి భవన్ వైపు కూడా వెళ్లలేదని చెబుతున్నారు. ఆ సమయంలో ట్యాపింగ్ చేసిన రహస్యాలేమైనా ప్రగతి భవన్ కు చేరి ఉంటాయని అందుకే దూరం పెట్టారన్న అనుమానాలు ఉన్నాయి. మొత్తంగా ట్యాపింగ్ విషయంలో ప్రణీత్ రావు వెల్లడించే విషయాలు.. బయట పెట్టే విషయాలు కూడా సంచలనంగా మారే అవకాశాలు ఉన్నాయి.