బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ఒకటి కాదు.. రెండు సీట్లు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఒకటి నాగర్ కర్నూలు, రెండు ఆదిలాబాద్. ఈ విషయం తెలిసి మాజీ ఎంపీ గోడం నగేష్ కూడా బీజేపీలో చేరిపోయారు. తెలంగాణలో మొత్తం 17 స్థానాలు ఉంటే అందులో హైదరాబాద్ లో పోటీ పెట్టినా ఒకటి పెట్టకపోయినా ఒకటే. మిగతా పదహారు స్థానాల్లో రెండు బీఎస్పీకి వదిలేస్తున్నారు. అంటే.. పధ్నాలుగు చోట్ల మాత్రమే బీఆర్ఎస్ పోటీ చేస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులు రెండు సీట్లు అడిగితే ఇవ్వకుండా వారిని వదిలేసుకున్నారు కేసీఆర్ . మునుగోడు ఉపఎన్నికల్లో వారి వల్లే గెలిచామని తెలిసినా పట్టించుకోలేదు. కమ్యూనిస్టులకు కాంగ్రెస్ ఒక్క సీటు ఇచ్చి పొత్తులో కలుపుకుంది.అది వారికి మేలు చేసింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే సరికి.. బీఎస్పీతో పొత్తుకు సిద్ధమయ్యారు. నిజానికి తెలంగాణలో బీఎస్పీకి దళితుల్లో కూడా పెద్దగా ఆదరణ లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద మూడున్నర లక్షల ఓట్లు కూడా రాలేదు. అయినా తమకు బాగా బ లమున్న రెండు సీట్లను ఇచ్చేస్తున్నారు.
సిట్టింగ్ స్థానం అయిన నాగర్ కర్నూలుతో పాటు గతంలో తిరుగులేని విజయం సాధించిన ఆదిలాబాద్ కూడా ఇచ్చేస్తున్నారు. కేసీఆర్ ఇంతలా ఎందుకు ఆందోళన చెందుతున్నారోనని బీఆర్ఎస్ వర్గాలు ఫీలవుతున్నాయి. ఖరారు చేస్తున్న అభ్యర్థులు కూడా అంత బలమైన వారు కాకపోవడంపై మరింత ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.