కె.విశ్వనాథ్ – కమల్ హాసన్.. వీరిద్దరి కాంబోలో అద్భుతమైన సినిమాలొచ్చాయి. వాటిలో ‘స్వాతిముత్యం’ ఒకటి. తెలుగు చిత్రసీమ ఘన కీర్తిని ఆస్కార్ వరకూ తీసుకెళ్లిన ఘనత ఈ చిత్రానికి దక్కుతుంది. అప్పట్లో ఈ చిత్రం ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. భాషతో సంబంధం లేకుండా అన్ని చోట్లా ఆడింది. కమల్ అద్భుతమైన నటన, అజరామరమైన గీతాలూ ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయి. విశ్వనాథ్ అభిరుచి ఉన్న దర్శకుడే కాదు. గీత రచయిత కూడా. తన సినిమాల్లోని పాటలకు ఆయన పల్లవి సాయం అందించిన సందర్భాలెన్నో. కొన్ని పాటలూ రాశారు. ‘స్వాతిముత్యం’లో ‘పట్టు చీర తెస్తనని’ అనే ఓ పాట ఉంది. అది… విశ్వనాథ్ రాసిందే.
నిజానికి స్క్రిప్టు దశలో ఈ పాట లేదు. షూటింగ్ కోసం లొకేషన్‌కు వెళ్తున్న సందర్భంలో పాట పెట్టాలన్న ఆలోచన వచ్చింది. అప్పటికప్పుడు విశ్వనాథ్ ఈ పాట రాస్తే.. అదే కారులో ఉన్న కమల్ హాసన్ ఈ పాటకు ట్యూన్ కట్టి, పాడారు. ఈ వెర్షన్‌తోనే ఈ పాట షూట్ చేశారు. ఆ తరవాత… బాలు, శైలజతో రికార్డ్ చేసి సినిమాలో వాడారు. అలా ఈ సినిమా సంగీతంలో.. కమల్ కూ వాటా దక్కిందన్నమాట. ఈ చిత్రంలోని ‘వటపత్ర సాయికి’ అనే లాలి పాట.. ఎప్పటికీ మర్చిపోలేం. దీన్ని సినారె రాసిన సంగతి తెలిసిందే. ఈపాటకు మరో వెర్షన్ కూడా ఈ సినిమాలో వాడారు. దాన్ని.. సీతారామశాస్త్రి రాశారు. అయితే అప్పటికి సిరివెన్నెల విడుదల కాలేదు. ‘సిరివెన్నెల’ కంటే ముందే సీతారామశాస్త్రి కలం మెరిసిన సందర్భం ఇది. ఈ చిత్రంలో కమల్ పేరు ‘శివయ్య’. అదే టైటిల్‌గా పెడదామని అనుకొన్నారు. కానీ.. హీరో పాత్ర పేరు కంటే, ఆ క్యారెక్టరైజేషనే టైటిల్ గా పెట్టాలన్న ఆలోచన నుంచి ‘స్వాతిముత్యం’ టైటిల్ వచ్చింది.
(స్వాతిముత్యం విడుదలై నేటికి 38 ఏళ్లు)