వైసీపీలో సమన్వయకర్తల నియామకాలు ఆషామాషీగా జరిగిపోతున్నాయా లేకపోతే వ్యూహాత్మకంగా గందరగోళం సృష్టించుకుంటున్నారా అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. ఇద్దరు ముగ్గురు అభ్యర్థులను పరిశీలించిన తర్వాత చివరికి గుంటూరు లోక్సభ అభ్యర్థిగా ఎంపిక చేసిన కిలారి రోశయ్యను ఖరారు చేశారు. ఆయన కూడా ఇంకా పూర్తి స్థాయిగా చురుగ్గా ప్రచారంలోకి దిగలేదు. ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలతో ఆయనింకా పూర్తిగా కనెక్ట్ కావడంలేదు. ఆయన కొనసాగుతారా మార్పులుంటాయా అనేది వైసిపి వర్గాల్లో చర్చ జరుగుతోంది.
డబ్బులు ఖర్చు పెట్టుకునేందుకు రోశయ్య వెనుకడుగు వేస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలపై అస్పష్టత కొనసాగుతోంది. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు కొనసాగుతారా? లేక మరొకరికి అవకాశం ఇస్తారా? అనే గందరగోళం నెలకొంది. మాజీ ఎంపి మోదుగుల వేణుగోపాలరెడ్డికి సత్తెనపల్లిలో అవకాశం ఇస్తారని అంటున్నారు. చివరికి అంబటి రాంబాబును గుంటూరు ఎంపీగా నిలబెట్టినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు.
గుంటూరుపశ్చిమ సీటు ఆశించిన మేయర్ కావటి మనోహర్ నాయుడ్ని ఇప్పుడు మూడు నెలల తరువాత చిలకలూరిపేటకు మార్చడం విడ్డూరంగా ఉందని వైసిపి నాయకులు వాపోతున్నారు. సహజంగా రాజకీయాల్లో నేను లోకల్ అనే నినాదం గెలిచే వారిని చూశామని కానీ అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి మార్పులు జరగడం ఈసారి ఎన్నికల్లో విచిత్రంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.