మైహోమ్ సంస్థకు కాంగ్రెస్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో ఆక్రమిత 150 ఎకరాల భూదాన్ భూములు ఖాళీ చేయాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మైహోమ్ సంస్థ సహా మరో నలుగురికి రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ నోటీసులు జారీ చేశారు. భూదాన్ భూముల్లో గత పదేళ్లుగా మైహోమ్ సంస్థ భారీ నిర్మాణాలు చేపట్టింది. భూదాన్ భూముల్లో అక్రమంగా మైహోమ్ సంస్థ చేపట్టిన నిర్మాణాల కూల్చివేతకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. బీఆరెస్ ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగిన మైహోం సంస్థ పెద్దలు అటు ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు ఇటు జంటనగరాల్లో పలు ఆక్రమణలకు పాల్పడినట్లుగా ఆరోపణలున్నాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వం భూదాన్ భూములకు సంబంధించి నోటీస్‌లు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది.
భూముల కబ్జాపై 2022లో ఓ లాయర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హుజూర్నగర్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు 6 మంది ప్రభుత్వ అధికారులపై క్రిమినల్ కేసులు, ఐదు గురు మైహోమ్స్, కీర్తి(సువర్ణ) సిమెంట్ యాజమాన్యాలపై క్రిమినల్ కేసు నమోదుకు ఉత్తర్వులు జారీ చేసింది. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్ర, రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 1057 లో గల 160 ఎకరాల భూదాన్ భూముల కొనుగోలు అక్రమ నిర్మాణాలపై మైహోమ్ సిమెంట్స్, కీర్తి (సువర్ణ) సిమెంట్స్ యాజమాన్యాలు సహా 6 మంది ప్రభుత్వ అధికారులపై క్రిమినల్ కేసు నమోదు అయింది. 11 మంది నిందితుల పై ఫోర్జరీ, చీటింగ్, ప్రభుత్వ ఆస్తి ధ్వంసం, కోర్టు కేసులో ఉన్న భూదాన్ భూములు అమ్మకం, అక్రమ నిర్మాణాలు, ల్యాండ్ కబ్జా కేసు నమోదు చేయాలని హుజూర్నగర్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు మేళ్లచెరువు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఆదేశాలు జారీ చేసింది.
భూదాన్ భూములపై నిందితులు ఫోర్జరీ పత్రాలు సృష్టించి అమ్మకాలు జరిపారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు, మట్టి మాఫియా, బోర్ల తవ్వకాలు, పర్యావరణ అనుమతులు లేకుండా చెట్లను నరకడం, అధికార యంత్రాంగాన్ని తప్పుదోవ, ఎన్ఓసి పత్రాలతో సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకూ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత నోటీసులు జారీ చేయడంతో తదపరి కీలక చర్యలు తీసుకునే అవకాశం ఉంది.