చేయూత పథకం పేరుతో అనకాపల్లిలో సీఎం జగన్ బటన్ నొక్కి వారం రోజులు అవుతోంది. కానీ ఇంతవరకూ ఒక్క లబ్దిదారు ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. కానీ ఊరూవాడా చేయూత సమావేశాలు పెట్టి డబ్బులేస్తున్నామని చెబుతున్నారు . నేడో రేపో ఎనికల కోడ్ వస్తుంది. ఆ కోడ్ వచ్చిన తర్వాత ఎలాగూ డబ్బులివ్వరు. మరి బటన్ నొక్కింది ఎందుకు అన్నది ఎందుకో చెప్పాల్సిన పని లేదు.
పథకానికి ఐదు వేల కోట్లకుపైగా డబ్బులు కావాలి. ఖజానాలో డబ్బులు లేవు. చేసిన అప్పులు అన్నీ అస్మదీయులకు బిల్లుల చెల్లింపుల దిశగా వెళ్లిపోయాయి.. ఆర్బీఐ కొత్త అప్పులు ఇవ్వడం లేదు. దీంతో ఆ పథకానికి ఆర్థిక శాఖ కనీసం బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ కూడా ఇవ్వలేదు. ముందుగా ఏదైనా పథకం అమలు చేసేందుకు బటన్ నొక్కాలంటే… వాటికిని నిధులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇవ్వాలి. కానీ ఈ పథకానికి ఆ ఆర్డర్ కూడా ఇవ్వలేదు. కానీ బటన్ నొక్కేశారు.
ఈ పథకం పేరుతో ప్రచారం పీక్స్ లో చేసుకుంటున్నారు. మరి డబ్బులేవి అంటే మాత్రం సమాధానం ఉండటం లేదు. ఇప్పటికే పెద్ద ఎత్తున పథకాలకు లబ్దిదారులకు డబ్బులు పెడింగ్ లో ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఖజానా వట్టిపోయింది. ప్రభుత్వం కూడా కోడ్ కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. ఆ కోడ్ వస్తే అందరికీ డబ్బులు ఎగ్గొట్టవచ్చని ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.