కాంగ్రెస్లో చేరేందుకు కడియం శ్రీహరి రెడీ అయ్యారని ఆయన వర్గీయులు మీడియాకు సమాచారం ఇచ్చారు. చర్చలు కూడా జరిపారు. అయితే కడియం వ్యూహం వేరే ఉందని.. ఆయన కుమార్తెకు లోక్ సభ టిక్కెట్ ఇప్పించుకునేందుకే ఈ ప్రచారం చేయించుకున్నారని కాస్త ఆలస్యంగా క్లారిటీ వచ్చింది.
వరంగల్ జిల్లాలో సీనియర్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ తదితరులు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పనున్నారనే వార్తలు బుధవారం ఉదయం నుంచి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆరే స్వయంగా రంగంలోకి సమావేశాల మీద సమావేశాలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, బస్వరాజు సారయ్య తదితరులు వరంగల్లో ఆరూరితో నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో వారు ఆయన్ను బలవంతంగా హైదరాబాద్లోని కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. మాజీ సీఎంతో మంతనాల అనంతరం ఆయన మెత్తబడ్డారు.
మరోవైపు కడియం శ్రీహరి సైతం కాంగ్రెస్తో టచ్లో ఉన్నారనీ, ఆయన్ను వరంగల్ నుంచి పోటీ చేయించేందుకు ఆ పార్టీ అధిష్టానం అంగీకరించిం దంటూ గుసగుసలు సైతం వినిపించాయి. తనకు ఎంపీ టిక్కెట్ ఇచ్చి, తాను ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేషన్ ఘన్పూర్ నుంచి తన కూతురికి అవకాశమివ్వాలంటూ కడియం కోరినట్టు కూడా తెలిసింది. దీనికి అధికార పార్టీ అంగీకరించిందనే లీకులు ఇచ్చారు. చివరికి కేసీఆర్ ఆయనతో చర్చలు జరిపి ఆయన కూతురు డాక్టర్ కావ్య పేరును వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటిచారు. దీంతో కడియం ఇష్యూ వరకూ క్లోజ్ చేయగలిగారు. ఇక ఆరూరి రమేష్ పరిస్థితి తెలియాల్సి ఉంది.