కర్నూలు జిల్లా ఆళ్ల గడ్డ నియోజకవర్గం భూమా కుటుంబం కంచుకోట. కానీ ఆ కుటుంబ పెద్దలు ఒకరు రోడ్ యాక్సిడెంట్ లో మరొకరు అనారోగ్యంతో చనిపోవడంతో వారసులు ఒంటరిగా రాజకీయ పోరాటం చేయాల్సి వస్తోంది. తండ్రి చేయి పట్టుకుని రాజకీయం ప్రారంభించిన అఖిలప్రియ ఇప్పుడు ఒంటరిగా పోరాడుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా ఆమె ముందుండి పార్టీ క్యాడర్ ను ధైర్యంగా నడుపుతున్నారు. కేసులు, జైళ్లకూ వెనుకాడలేదు.
ఆంధ్రప్రదేశ్ లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆళ్లగడ్డది ఓ ప్రత్యేకమైన స్థానం. ఇక్కడ గంగుల వర్సెస్ భూమా కుటుంబాల మధ్యే రాజకీయ ఆధిపత్య పోరాటం కనిపిస్తుంటుంది. చెరో పార్టీలో ఉంటూ రాజకీయాలు చేస్తారు. 1970ల నుంచి ఈ రెండు ఫ్యామిలీలే ఆళ్లగడ్డ రాజకీయాలను శాసిస్తున్నాయి. 2014లో వైసీపీ అభ్యర్థిగా ఉన్న భూమా శోభా నాగిరెడ్డి ఎన్నికలు రెండు వారాల్లో ఉన్నాయనగా విజయమ్మ, షర్మిలలతో పాటు ప్రచారంలో పాల్గొని తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అప్పటికే ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకోవడంతో పోల్స్ నిర్వహించారు. ఆ ఎన్నికల్లో శోభానాగిరెడ్డి గెలిచారు. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికలో శోభా నాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియ విజయం సాధిచారు. తర్వాత తండ్రితో పాటు టీడీపీలో చేరారు. కానీ మధ్యలోనే తండ్రినీ కోల్పోయారు. చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు. నంద్యాల ఉపఎన్నికలో సోదరుడ్ని గెలిపించుకున్నారు.
కానీ రాజకీయం ఎప్పుడూ ఒకలాగే ఉండదు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆళ్లగడ్డలో వైసీపీ నుంచి గంగుల బ్రిజేంద్ర రెడ్డి, టీడీపీ నుంచి భూమా అఖిలప్రియ పోటీ చేశారు. ఇందులో వైసీపీ నుచి నిలబడ్డ బ్రిజేంద్ర రెడ్డి 57 శాతం ఓట్లు రాబట్టారు. టీడీపీ అభ్యర్థి అఖిలప్రియ 38 శాతం మాత్రమే ఓట్లు తెచ్చుకున్నారు. 2014లో టీడీపీ టిక్కెట్ పై పోటీ చేసిన గంగుల ప్రభాకర్ రెడ్డి కొడుకే 2019లో వైసీపీ టిక్కెట్ పై పోటీ చేసి గెలిచిన బ్రిజేంద్ర రెడ్డి. ఆళ్లగడ్డలో ప్రతీ గ్రామంలో గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూపుల్లో భూమా వర్గం.. గంగుల వర్గాలు ఉంటాయి. భూమా దంపతులు చనిపోవడంతో ఆ వర్గం కాస్త భయానికి గురైంది. అందుకే గత ఎన్నికల్లో వెనక్కి తగ్గారు.
కానీ అఖిలప్రియ.. తాను తల్లిదండ్రుల్లాగే ఎదురు నిలబడాతనని ధైర్యం ఇవ్వడంతో తర్వాత అంతా ముందుకు వస్తున్నారు. ఆళ్లగడ్డలో మొదటి నుంచి ఇతర విషయాలకు ప్రాధాన్యం తక్కువ. కానీ గత ఐదేళ్లుగా తీవ్రమైన నీటి ఎద్దడి , విద్యావకాశాలు లేకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి కనిపిస్తోంది. దీన్ని అఖిల ప్రియప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతున్నారు. టీడీపీ టిక్కెట్ కూడా ఖరారు చేయడంతో ఆమె జోరుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రెడ్డి సామాజికవర్గం డామినేటింగ్ కానీ సంఖ్యా పరంగా తక్కువే. ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వారు 22 శాతం మంది ఉన్నారు. కీలకమైన మరో సామాజికవర్గం బలిజలు. జనసేన పొత్తు ఉండజటంతో వీరిలో టీడీపీ వైపు మొగ్గు కనిపించే చాన్స్ కనిపిస్తోంది. ముస్లింలు కూడా గణనీయసంఖ్యలో ఉన్నారు. వీరు గెలుపోటముల్ని నిర్దేశించగలరు.
అఖిలప్రియ.. కుటుంబాన్ని ఏకతాటిపైకి నడిపించడంలో విఫలమయ్యారన్న అభిప్రాయాలు ఉన్నాయి. తండ్రికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి దూరమయ్యారు. శత్రువుగా మారారు. భూమా కిషోర్ రెడ్డి అనే మరో బంధువు అఖిలప్రియపై తీవ్రంగా ఆరోపణలు చేస్తూ వైసీపీలో చేరిపోయారు. ఎలా చూసినా అఖిల ప్రియ.. ఒంటరి పోరాటం చేస్తున్నారు. మరో వైపు గంగుల కుటుంబం ఏకతాటిపైన ఉంది. కానీ అఖిలప్రియ కాన్ఫిడెన్స్ గా రాజకీయాలు చేస్తున్నారు. సత్తా చూపిస్తానంటున్నారు. ఆళ్లగడ్డలో పోరు హోరాహోరీగా సాగే అవకాశాలు ఉన్నాయి. అఖిలప్రియ గెలిస్తే.. కర్నూలు జిల్లాలో మరోసారి తండ్రి స్థాయిలో పవర్ చూపించగలరు.