ఓటీటీల వల్ల కంటెంట్‌లో ఎంత కొత్తదనం వస్తోందో.. హింస, అశ్లీలత అంతగా పెరిగిపోతున్నాయి. ఓటీటీలకు సెన్సార్ నిబంధనలు లేకపోవడమే ఇందుకు కారణం. ఓటీటీ ని అడ్డంగా పెట్టుకొని ఏదైనా చూపించేయొచ్చు అని భావిస్తున్నారు. దాంతో విచ్చలవిడి శృంగారం ఓటీటీల్లో దర్శనమిస్తోంది. దీనిపై కేంద్రం ఇప్పుడు కొరడా ఝులిపించింది. బూతు, అడ్డగోలు శృంగార సన్నివేశాలతో కంటెంట్ నింపేస్తున్న 18 ఓటీటీలపై నిషేధం విధిస్తూ కేంద్ర సమాచార శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇవి తక్షణం అమలులోకి వస్తాయి. ఉల్లూ, అన్ కట్ అడ్డా లాంటి కొన్ని బీ గ్రేడ్ ఓటీటీ యాప్‌లు… విచ్చలవిడి శృంగార సన్నివేశాలకు వేదికగా మారుతున్నాయి. వీటిపై నిషేధం విధించాలని ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. ఆయా యాప్‌లకు కేంద్రం ఇది వరకే హెచ్చరికలు జారీ చేసింది. అసభ్యకరంగా ఉన్న కంటెంట్ ని తొలగించమని నోటీసులు పంపింది. కానీ.. కొన్ని ఓటీటీలు పెడచెవిన పెట్టాయి. ఇప్పుడు అవన్నీ నిషేధానికి గురయ్యాయి. హాట్ షార్ట్ వీఐపీ, హంటర్స్, వూవీ, రాబిట్, ఎక్స్ ప్రైమ్, అన్ కట్ అడ్డా లాంటి బీ గ్రేడ్ యాప్‌లు ఇక నుంచి ప్లే స్టోర్‌లో కనిపించవు.
అయితే ఇలాంటి బీ గ్రేడ్ యాప్‌లపై నిషేధం విధిస్తే సరిపోదు. ఓటీటీల్లో వస్తున్న కంటెంట్ పైనా దృష్టి పెట్టాలి. ఓటీటీలకు సెన్సార్ షిప్ వర్తించేలా నిబంధనలు చేర్చాలి. ప్రైమ్ వీడియో, హాట్ స్టార్ లాంటి ఓటీటీల్లో.. బూతు, సెక్స్ లేదా? వాటిని కేంద్రం ఎందుకు కంట్రోల్ లో పెట్టలేకపోతోంది అనేది పెద్ద ప్రశ్న. రానా నాయుడు వెబ్ సిరీస్ నిండా బూతులే. మరి అలాంటి సిరీస్‌లను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? దీనిపై విస్త్రతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది.