బీఆర్ఎస్ నుంచి డైలీ సీరియల్లాగా నేతలు చేజారిపోతున్నారు. నిన్నంతా ఆరూరి రమేష్ ను పార్టీ నుంచి వెళ్లకుండా ఆపడానికి హైడ్రామా నడిపినప్పటికీ గురువారం ఉదయం ఆయన ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. తెలంగాణ బీజేపీ నేతలతో కలిసి బీజేపీలో చేరేందుకు ఢిల్లీ వెళ్లారు. బీజేపీ వరంగల్ అభ్యర్థి ఆయనే అయ్యే అవకాశం ఉంది. ఆయనను బీజేపీలో చేరకుండా హైడ్రామా సృష్టించుకుని పలుచన అయిపోయామని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఫీలవుతున్నారు. మరో వైపు మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. తనకు పార్టీలో అవమానాలు జరిగాయన్నారు.
ఇక బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్లో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో వారు సమావేశం అయ్యారు. అయితే ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు రేవంత్ రెడ్డి అంగీకరించలేదని తెలుస్తోంది. దీంతో ఆయన డీకే శివకుమార్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మల్లారెడ్డి , ఆయన కుమారుడు డీకే శివకుమార్ ను కలిశారు. ఈ ఫోటో బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ లో చేర్చుకోవడమే కాకుండా తన కుమారుడు భద్రారెడ్డికి మల్కాజిగిరి టిక్కెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.
ఇక కోనేరు కోనప్ప కొద్ది రోజుల కిందటే రాజీనామా ప్రకటించారు. సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. తాజాగా ఆయన రాజకీయ గురువు ఇంద్రకరణ్ రెడ్డి కూా కాంగ్రెస్ గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. అదిలాబాద్ జిల్లా రివ్యూ మీటింగ్ కు ఇంద్రకరణ్ రెడ్డి హాజరు కాలేదు. కొన్నిరోజుల క్రితమే ఇంద్రకరణ్ రెడ్డితో భేటీ అయిన కాంగ్రెస్ నేత సుదర్శన్ రెడ్డి పార్టీలో చేరిక అంశాలపై చర్చించారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్న అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తర్వాత నిర్ణయం తీసుకునే అవకాసం ఉంది. ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ నేత. 2014లో టిక్కెట్ రాకపోవడంతో కోనప్పతో కలిసి బీఎస్పీ టిక్కెట్ల మీద పోటీ చేసి గెలిచారు. తర్వాత బీఆర్ఎస్ లోకి వెళ్లి మంత్రి అయ్యారు. పదేళ్ల పాటు ఇంద్రకరణ్ మంత్రిగా ఉన్నారు.