చరిత్ర చూసిన ఎంతో మంది నియంతలు కాలగర్భంలో గుర్తు చేసుకోకుండా ఉండేలా కలిసిపోయారు. అధికారం చేతికి అందేదాకా ఒకలా.. అందిన తర్వాత తానే సర్వం అన్నట్లుగా వ్యవహరించే వారి అధికారానికి వేగంగానే అంతిమ ఘడియలు వస్తాయి. మరోసారి అది ఏపీలో నిరూపణ కాబోతోంది. ప్రజలు ఎంతో విశ్వాసంతో కట్టబెట్టిన భారీ మెజార్టీని చూసుకుని తానే దైవం అనుకున్న పాలకుడికి చివరికి పరువు కూడా మిగలకుండా ఓటమిని కట్టబెట్టబోతున్నారు. ఇందు కోసం రంగం సిద్ధమయింది. ఏ క్షణంలో అయినా ఎన్నికల నోటిఫికేషన్ రావొచ్చు. మొదటి విడతలోనే పోలింగ్ జరుగుతుంది. కౌంటింగ్ రోజున జాతకం బయటపడుతుంది. ఓడిపోతే ఇంటికెిళ్లేపోయేలా పాలన చేయలేదు. రాష్ట్రానికి చేసిన ప్రతీ నష్టానికి .. చేసిన ప్రతి విధ్వంసానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుుకంటే ప్రజలు ఐదేళ్ల అధికారం ఇచ్చింది.. చెప్పినవి చేస్తారని.. అప్పులు చేయమని కాదు. పగ, ప్రతీకారాలు తీర్చకోమని కాదు. దురదృష్టవసాత్తూ.. ప్రజలు తనకు అధికారం ఇచ్చింది.. ప్రజాధనంతో విలాసాలు చేసుకోవడానికి.. విచ్చలవిడిగా పార్టీ లబ్ది కోసం ఖర్చు పెట్టుకోవడానికి అన్నట్లుగా పాలన చేశారు. ఇప్పుడు ప్రతీ దానికి ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉండదా ?
వాలంటీర్ల మీద పెట్టిన ఖర్చుతో పోలవరం పూర్తయ్యేది కాదా?
ప్రతి యాభై ఇళ్లకు ఓ మనిషిని పెట్టి.. పార్టీ తరపున ఓటర్లను బెదిరించడానికి పెట్టుకున్న వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. ఈ ఒక్క వ్యవస్థ మీద.. ఐదేళ్లలో పదిహేను వేల కోట్లుకుపైగా ఖర్చుపెట్టారు. ఈ రూ. పదిహేను వేల కోట్లతో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది కాదా ?. కేంద్రం నిధులు ఇవ్వలేదని.. కాంట్రాక్టర్ ను మార్చి ఐదేళ్లుగా రాష్ట్ర జీవనాడి వంటి ప్రాజెక్టును పడుకోబెట్టారు. ఫలితంగా కట్టిన నిర్మాణాలు కూడా చెడిపోయే పరిస్థితి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు. సొంత రాజధానిపై కులం ముద్ర వేసి.. కుక్కలు చింపిన విస్తరి చేసి పడేశారు. పది లక్షల కోట్ల సంపద సృష్టిని ఆపేశామని ఘనత వహించిన విజయసాయిరెడ్డి వంటి వారు చెప్పుకున్నారు. అదంతా ఓ కులం సొమ్ము అయినట్లుగా చెప్పుకున్నారు. ఎంత అన్యాయంగా వ్యవహరించారో.. ఎంత దారుణంగా పాలన చేశారో.. అమరావతే పెద్ద ఉదాహమరణ. సొంత ఇల్లు ప్రైవేటు ఆస్తి. ఆ ఒక్క ఇంటికి వంద కోట్ల ప్రజాధనం పెట్టి సోకులు చేయించుకున్నారంటే.. ఎంత బాధ్యతా రాహిత్యమో అర్థం చేసుకోవచ్చు. ప్రజాధనంతో సభలు పెట్టి ఎన్నికల ప్రచారం చేసుకోవడం దగ్గర్నుంచి ఐ ప్యాక్ కు కట్టే డబ్బులు.. సోషల్ మీడియా ప్రచారం మొత్తం ప్రజల డబ్బే. ఏ మాత్రం నైతిక విలువలు లేకుండా.. సొంత మీడియాకు.. సొంత సిమెంట్ కంపెనీలకు వేల కోట్లు ధారబోయడం ఏమిటి ?. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోల్ పేరుతో చేసిన స్కాంల గురించి ఎంత చెప్పుకుంటే అంత తక్కువ. ఇవన్నీ ప్రజలు తెలియవనుకుంటే.. మీ అంత అమాయకులు ఎవరూ ఉండరు.
సొంత ఓటు బ్యాంక్‌ను దోచుకున్న ఏకైక పాలకుడు
ఏపీలో వైసీపీ, జగన్ మోహన్ రెడ్డి ఓటు బ్యాంక్ అంటే ఎవరు ?. మా ఓట్లు వేర అని సజ్జల నమ్మకంగా చెబుతున్నారంటే.. వారికి స్పష్టంగా తమ ఓట్లు ఎవరికో స్పష్టత ఉంది. కానీ ఆ ఓటర్లనే అడ్డగోలుగా దోచుకున్నారు మద్యం విధానం, వన్ టైమ్ సెటిల్మెంట్, ఇంటి వద్దకే రేషన్ బియ్యం, చెత్త పన్ను , ఆస్తి పన్ను, అందరికీ ఇళ్లు పేరుతో స్కాంలు ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ పేదలను నిట్ట నిలువుగా దోచుకునే పథకాలను ఎన్నింటినో పెట్టింది. వాటి కారణంగా బీద, మధ్యతరగతి ప్రజలు అప్పుల పాలయ్యారు. మద్యం అలవాటు ఎక్కువగా ఉండేది ఎవరికి? ఎవరు మద్యం మీద ఎక్కువ ఖర్చు పెడతారు ? ఈ అంశంపై పెద్దగా ఎవరూ పరిశోధన చేయాల్సిన అవసరం లేదు. ఏపీలో ఉండే ఎగువ .. ఉన్నత కుటుంబాలు మద్యం మీద పెట్టే ఖర్చు వారి ఆదాయంతో పోలిస్తే చాలా తక్కువ. ఎందుకంటే వారి కుటుంబాలు చాలా పరిమితం. ఏపీలో ఉన్న రేషన్ కార్డుల ప్రకారం చూస్తే..85 శాతం మంది కన్నా దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే ఉంటారు ఇటీవల జగన్ ఏపీ పేద రాష్ట్రమని 80 శాతానికిపైగా ప్రజలు పేదవారేనని బహిరంగంగా ప్రకటించారు. ఈ ప్రకారం చూస్తే ఏపీలో మద్యం తాగే వారంతా పేదలే. ప్రభుత్వానికి లభిస్తున్న రూ. పాతిక వేల కోట్ల మద్యం ఆదాయం ఆ పేద ప్రజల సొమ్మే. ఈ మద్యంతో వారి ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని కొల్లగొట్టేందుకా ఐదేళ్ల పాలన అవకాశ ఇచ్చింది. ఎప్పుడో ఎన్టీఆర్ సమయం నుంచి ఇచ్చిన ఇళ్లబకాయిల్ని నసూలు చేయడానికి పథకం పెట్టిన ఒకే ఒక్క సీఎం జగన్ . వన్ టైం సెటిల్మెంట్ స్కీం. ఓటీఎస్ పేరుతో పేద ప్రజలను ఏపీ సర్కార్ అప్పుల పాలు చేసింది. రూ. పది, ఇరవై వేలు కడితే.. గతంలో ఇళ్ల లబ్దిదారులపై ఉన్న రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని ప్రకటించారు. ముఫ్పై ఏళ్ల కిందట తీసుకునన్న రుణాలను కూడా ముక్కు పిండి వసూలు చేశారు. నిజానికి వారంతా నిరుపేదలు.. రెక్కాడితే డొక్కాడనివారు. ఇళ్లకు పూర్తిగా రుణం ఇవ్వకపోయినా.. ఇప్పటికి ఉండటానికి ఇల్లు లేకపోయినా … వారిని వదిలి పెట్టలేదు. డబ్బులిచ్చి ప్రైవేటు సైన్యంలా పోషిస్తున్న వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, పోలీసులు ఇలా ఓ గుంపును.. పేదల ఇళ్లపైకి పంపి.. బెదిరించి మరీ వసూలు చేశారు. ఇవ్వలేని వారికి అప్పులు ఇప్పించారు. ఇలా ఓటీఎస్ పేరుతో పేదల నుంచి వసూలు చేసిన వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఏం చేసిందో కానీ.. వారికి మాత్రం అప్పులు మిగిలాయి.
సెంటు స్థలం ఇళ్ల పేరుతో లక్షల అప్పుల ఊబిలోకి పేదలు !
ముఫ్పై లక్షల మందికి ఇళ్ల స్థలాలంటూ.., ప్రభుత్వం ఎంత హడావుడి చేసిందో అందరం చూశాం. కనీసం రూ. పదిహేను వేల కోట్లు పెట్టి.. పనికి రాని స్థలాలను వైసీపీ నేతల వద్ద నుంచే కొనుగోలు చేశారు. చివరికి మడ అడవుల్ని కూడా కొట్టేశారు. ఎన్జీటీ రూ. ఐదు కోట్ల ఫైన్ వేసింది. అవన్నీ పక్కన పెడితే.. ఇప్పుడు పేదలను ఆ ఇళ్ల పేరుతో లక్షలకు లక్షలు అప్పుల పాలు చేస్తోంది ప్రభుత్వం. ఇచ్చేది సెంటు భూమి. అంటే 30 గజాలు మాత్రమే. అందులో ఎంత ఇల్లు వస్తుందో కనీస అవగాహన ఉన్నవారికైనా తెలుస్తుంది. ఇప్పుడు ఇచ్చి స్థలాల్లో ఇల్లు కట్టుకోవాలని లబ్దిదారుల్ని బెదిరిస్తున్నారు. ఈ ఇళ్ల కోసం కేంద్రం ఇచ్చే రూ. లక్షా ఎనభై వేలును మాత్రమే రాష్ట్రం ఇస్తోంది. అంతే కానీ సొంతంగా రాష్ట్రం పైసా ఇవ్వడం లేదు. స్థలం ఇచ్చాం కదా అంటోంది. ఈ రోజుల్లో రూ. లక్షా ఎనభై ఐదు వేలకు.. పునాదులు కూడా వేయలేరు. ఎంత చిన్న స్థలం అయినా.. వాటికి గ్రౌండింగ్‌కు ఖర్చు అవుతుంది. ఇల్లు ఎంత సాదాసీదాగా కట్టుకోవాలన్నా మరో మూాడు, నాలుగు లక్షల ఖర్చు అవుతుంది. పేదలందర్నీ ఇళ్లు కట్టుకోకపోతే ఇచ్చిన స్థలం కూడా క్యాన్సిల్ చేస్తామని బెదిరించి.. ఎక్కడెక్కవన్నీ అప్పులు చేసి మరీ ఇల్లు కట్టుకునేలా చేస్తున్నారు. ఇలా స్థలాలు పొందిన లబ్దిదారుల్లో లక్షల మంది ఇప్పటికే లక్షల రూపాయల అప్పులు చేసి వడ్డీలు కట్టుకుంటున్నారు. ఇందులో విషాదం ఏమిటంటే.. ప్రభుత్వమే డ్వాక్రా పేరుతో రూ. ముఫ్పై ఐదు వేలు లోను ఇప్పించడం.. దాన్ని కూడా లబ్దిదారులకు ఇవ్వకుండా.. ఇంటి నిర్మాణ కాంట్రాక్టర్లు అంటూ.. వైసీపీ నేతలకే మళ్లించడం. ఇప్పుడు ప్రజలకు ఇల్లు లేదు. ఎప్పుడు వస్తుందో తెలియదు. వారి నెత్తి మీద లక్షల అప్పు ఉంది. ఇక టిడ్కో ఇళ్ల లబ్దిదారుల్ని ఎంతగా వంచించాలో అంతగా వంచించారు. చివరికి టిడ్కో ఇళ్లను తాకట్టు పెట్టేసుకున్నారు.
రేషన్ బియ్యమూ దక్కకుండా చేసే దరిద్ర పాలన !
పేదలు రేషన్ బియ్యం మీదే ఎక్కువ ఆధారపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ బియ్యం తినే వారిసంఖ్య పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. సన్నబియ్యం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. మధ్యలోనే నీ అమ్మ మొగుడు చెప్పాడా అని మాట మార్చారు. రేషన్ డీలర్ల దగ్గర్నుంచి ఇంటింటికీ రేషన్ సరఫరా పేరుతో వాహనాలకు ఎక్కించి..వారి దగ్గర్నుంచి బియ్యం మాఫియాకు తరలిస్తున్నారు. లబ్దిదారులకు కేజీకి రూ. పది చొప్పున ఇచ్చి సరి పెడుతున్నారు. గతంలో అధికారంగా ప్రభుత్వమే ఇలా ఇవ్వాలని అనుకుంది. తర్వాత మనసు మార్చుకుంది. కానీ పథకాన్ని మాత్రం.. అమలు చేసేస్తున్నారు. ఇలా పేదలకూ రేషన్ బియ్యం అందకుండా పక్కదారి పట్టిస్తున్నారు. చెత్త పన్నులు, ఆస్తి పన్నులు ఇలా ప్రతి ఒక్క పన్నలు పెంచారు. వందల కోట్లను వసూలు చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఎవరైనా ఓటు బ్యాంక్‌కు మంచి చేసి..మరింత పాజిటివ్ ఓటు తెచ్చుకోవాలనుకుంటారు.. కానీ ఇది ఔట్ డేటెడ్ రాజకీయం. ఓటు బ్యాంకును దివాలా తీయించి.. రెండు ముద్దలు వారికి పెట్టి.. వారికి మేలు చేస్తున్నట్లుగా నటించడం ద్వారా.. వారిని తిరుగులేని ఓటు బ్యాంక్‌గా మార్చుకోవడమే నయా రాజకీయం. దీని వల్ల పేదలు బికారులవుతారు.. కానీ వారిని ఆ స్థితికి తెచ్చినవారు మాత్రం.. తిరుగులేని ధనవంతులవుతారు.
ఇక పేదలు తట్టుకోలేరు.. టైం అయిపోయింది !
డబ్బులు అకౌంట్లలో వేశానని ఇంటింటికి లెటర్లు పంపుతున్నారు. అందులో సగం అయినా నిజంగా లబ్దిదారులకు వచ్చాయో లేదో ఎవరికీ తెలియదు. ఎందరూ కొరగాని సెంట్ స్థలం ఇచ్చి అదే పది లక్షలు చేస్తుందని గొప్పలు చెప్పుకుంటే.. ఇల్లు రాదు.. కడుపు నిండదు. కడుపు కాలిన వారందరికీ ఇప్పుడు కర్రు కాల్చి వాత పెట్టే సమయం వచ్చింది. ఇప్పుడు ప్రజల సమయం వచ్చేసింది.