కేసీఆర్ ఉన్నంత కాలం సీఎంగా ఉంటారన్న అంచనాలను బద్దలు కొట్టి సీఎం అయిన రేవంత్ రెడ్డి వంద రోజుల పాలన పూర్తి చేసుకున్నారు. గతేడాది డిసెంబరు 7న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, పాలనా పగ్గాలు చేపట్టిన ఎనుముల రేవంత్రెడ్డి… ఇటు ప్రభుత్వంలోనూ, అటు పార్టీలోనూ తనదైన శైలిలో ముందుకెళుతున్నారు. ఆయన సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే… మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిధి రూ.10 లక్షలకు పెంపు పథకాలను అమల్లోకి తెచ్చింది.
వీటితోపాటు రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ సౌకర్యాలకు శ్రీకారం చుట్టింది. తాజాగా ఇందిరమ్మ ఇండ్లకు అంకురార్పణ చేసింది. తద్వారా ఆరు గ్యారెంటీల పరిధిలో ఉన్న 13 అంశాలకు సంబంధించి ఐదింటిని పూర్తి చేశామని ప్రకటించింది. మిగతా 8 అంశాలపై విధానపరమైన నిర్ణయాలు తీసుకుని, నిధులు కేటాయించాల్సి ఉంది. వంద రోజుల్లో రేవంత్ రెడ్డి సర్కార్ కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చి ప్రజలకు అందుబాటులోకి తెతచ్చింది. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా పథకాల లబ్దిదారుల ఎంపిక చేపట్టింది.
అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 29,384 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రభుత్వం. నిజానికి గతంలోనే వీరి ఎంపిక ప్రక్రియ పూర్తయింది. నియామక పత్రాలు మాత్రం ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటనపై విజిలెన్స్ విచారణను ప్రారంభించారు. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సందర్భంగా పెట్టుబడులను ఆకర్షించటంలో గట్టి ప్రయత్నమే చేశారు. అనేక నిర్ణయాలు శరవేగంగా తీసుకున్నారు.
అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ. గొర్రెల పంపిణీ పథకం, చేప పిల్లల పెంపకం పథకాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశం. ధరణి పోర్టల్ ఏజెన్సీపై విచారణ. మిషన్ భగీరథ విలేజ్ లెవల్ ఇంట్రా పైపులైన్లు, గ్రామాల్లో పనులపై విచారణ. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ అధికారుల పాత్రపై విచారణ. వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో రూ. వందల కోట్లకుపైగా వ్యాట్ ఎగవేత. వంటి వాటిపై విచారణలు చేయిస్తున్నారు. వంద రోజుల పాలన పూర్తిగా లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సాగింది.