గతంలో రెండు సార్లు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలను బీఆర్ఎస్ లో కేసీఆర్ విలీనం చేసుకున్నారు. ఈ సారి బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఎంత వద్దనుకున్నా ఆయన ప్రభుత్వాన్ని పడగొడతామని.. పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత రేవంత్ ప్రభుత్వం ఉండదని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న హెచ్చరికలతో చాన్సివ్వకూడదని రేవంత్ రెడ్డి డిసైడయ్యారు. బీఆర్ఎస్ కు ఉన్న 35 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 20 మందికిపైగా దారికి వచ్చారని.. వచ్చే పది రోజుల్లో మరో పన్నెండు మందిని దారికి తెచ్చుకుని విలీనం పూర్తి చేస్తారన్న చర్చ జరగుతోంది.
గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు తప్ప అందరూ కాంగ్రెస్ లో చేరిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న ప్రచారం ఊపందుకుంటోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి దానం నాగేందర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆయన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఆయన కాంగ్రెస్ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ సహా సీనియర్ కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.
దానం నాగేందర్ సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయన హైదరాబాద్ మొత్తం చక్రం తిప్పారు. మంత్రిగా ఆయన ఏం చెబితే అది జరిగేది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వక భేటీ నిర్వహించారు. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు ఇద్దరూ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలన్నట్లుగా రెడీగా ఉన్నారు.