జగన్ మోహన్ రెడ్డి మరోసారి ప్రజా తీర్పు కోసం ఎన్నికలకు వెళ్తున్నారు. ఈ సారి సీఎం హోదాలో తన పాలనపై తీర్పు కోరబోతున్నారు. అలా కోరే ముందు తన పాలనపై అభిప్రాయాన్ని… వారి ప్రశ్నలకు సమాధానాలను .. జగన్ మోహన్ రెడ్డి చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఆయన గెలుపులో వారిద్దరి పాత్ర కూడా కీలకం. వైఎస్ షర్మిలా రెడ్డి, వైఎస్ సునీతారెడ్డి శుక్రవారం కడపలో జరిగిన వివేకా వర్థంతి సభలో జగన్మోహన్ రెడ్డికి సూటి ప్రశ్నలు సంధించారు. వాటిని విననట్లు.. చూడనట్లుగా వెళ్లిపోతే.. అంత కంటే దౌర్భాగ్యం ఉండదు. వారికి జగన్ సమాధానం చెప్పిన తర్వాతే ఎన్నికల బరిలోకి దిగారు.
గత ఎన్నికలకు ముందు ఇలాగే… అభ్యర్థుల్ని ప్రకటించే ముందు రోజు.. వివేకా హత్యకు గురయ్యారు. ఎన్నికల్లో జగన్ గెలిచి సీఎం అయ్యారు. ఈ లోపు ఈ సోదరీమణులిద్దరూ జగన్ గెలుపు కోసం విస్తృతంగా శ్రమించారు. తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్న వైఎస్ సునీతారెడ్డి… సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్లుగా మీడియా సమావేశాల్లో చెప్పారు. తన తండ్రి హంతకుల్ని జగన్ సీఎం అయితే శిక్షిస్తారని ఆశపడి ఆమె సజ్జల చెప్పమన్నదల్లా చెప్పారు. ఇక వైఎస్ షర్మిలారెడ్డి తన తల్లి విజయమ్మతో కలిసి రాష్ట్రమంతా తిరిగారు. జగన్ కు ఓటేయాలన్నారు. ఇప్పుడు ఆమె కూడా.. సూటి ప్రశ్నలు వేస్తున్నారు. వాటికి సమాధానం చెప్పొద్దా ?
రాష్ట్ర ప్రజలకు న్యాయం చేశారా.. అన్యాయం చేశారా అన్నది ప్రజలు తీర్పు చెబుతారు. కానీ సొంత చెల్లెళ్ల విషయంలో జగన్ మోహన్ రెడ్డి మాత్రం సమాధానం చెప్పాల్సిందే. లేకపోతే ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి తీరును అసహ్యించుకుంటారు. ఓట్లు అడగడానికి వెళ్తే… అందరికీ ఇద్దరు చెల్లెళ్లే గుర్తుకు వస్తారు. మౌనంగా ఉంటే.. తప్పు చేశారని ప్రజలు కూడా భావిస్తారు. వాళ్లే చంపించారని నిందలు వేసి.. తప్పుడు ప్రచారాలు చేసి ఎన్నికలకు వెళ్తే… కర్రు కాల్చి వాత పెడతారు.