సికింద్రాబాద్ ఎంపీ సీటు కోసం దిగ్గజాలు పోటీ పడబోతున్నారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోటీ చేయడం ఖాయం. ఆయనకు ప్రత్యర్థులు ఎవరు అన్నానిపై నిన్నామొన్నటి వరకూ స్పష్టత లేదు. కానీ ఇప్పుడు గ్రేటర్ పరిధిలో కీలక నేతలుగా ఉన్న వారే పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ తరపున దానం నాగేందర్, బీఆర్ఎస్ తరపున తలసాని పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో సికింద్రాబాద్ పోరు హోరాహోరీగా సాగనుంది.
సికింద్రాబాద్ నియోజకవర్గం బీజేపీకి కంచుకోటగా ఉంది. గత రెండు సార్లు బీజేపీ గెలిచింది. మజ్లిస్ పోటీ చేస్తే బీజేపీకి తిరుగులేని విజయం దక్కుతుంది. కానీ గతంలో బీఆర్ఎస్ అవగాహన మేరకు మజ్లిస్ పోటీ చేయలేదు. ఈ సారి కాంగ్రెస్ తో మజ్లిస్ ఆ మేరకు అవగాహన పెట్టుకునే అవకాశం ఉంది. సికింద్రాబాద్ అభ్యర్థిగా దానం నాగేందర్ ఎంపిక చేయాలని రేవంత్ రెడ్డి ఆలోచించడంలోనే ప్రత్యేకమైన వ్యూహం ఉందని భావిస్తున్నారు. తన కుమారుడికి సీటు కోసం తలసాని ప్రయత్నిచినా హైకమాండ్ ఆయననే బరిలోకి దించాలని అనుకుంటోంది.
ఇటీవల అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో సికింద్రాబాద్ పరిధిలో ఆరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిచింది. ఒక్క చోట మజ్లిస్ గెలిచింది. ఆ ఆరింటిలో ఖైతరాబాద్ కూడాఉంది. ముషీరాబాద్, అంబర్ పేట, జూబ్లిహిల్స్, సనత్ నగర్, సికింద్రాబాద్ లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. నాంపల్లిలో మజ్లిస్ ఎమ్మెల్యే ఉన్నారు. ఈ సారి ముస్లిం ఓటర్ల మద్దతు కాంగ్రెస్ కు ఉంటుందన్న ప్రచారం జరుగుతున్న సమయంమలో … ఆ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఎలా చూసినా ఈ సారి కిషన్ రెడ్డికి అంత సులువైన రాజకీయం కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది.