తెలంగాణ గవర్నర్ తమిళిసై సొందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. తమిళనాడు నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ రాజీనామా విషయాన్ని సోమవారం రాజ్ భవన్ అధికారికంగా దృవీకరించలేదు.. తమిళిసై లోక్ సభ ఎన్నికల్లో కన్యాకుమారి, చెన్నై సౌత్ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. తమిళిశై కొంత కాలంగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆ పదవికి కూడా రాజీనామా చేసినట్లుగా చెబుతున్నారు.
తమిళిశై గవర్నర్ గా వచ్చే ముందు బీజేపీ తమిళనాడు అధ్యక్షురాలిగా వ్యవహరించారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర చెన్నై నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2011 ఎన్నికల్లో వేళచ్చేరి నియోజకవర్గం నుంచి పోటీచేసి నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి నేతృత్వంలో తూత్తుకుడి నుంచి పోటీ చేసి డీఎంకే అభ్యర్థి కనిమొళి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత తమిళిసైను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు గవర్నర్‌గా పంపింది.
దూకుడైన నేతగా పేరున్న తమిళిశై గవర్నర్ పదవి విషయంలో ఇబ్బంది పడ్డారు. కేసీఆర్ సర్కార్ ఆమెకు ప్రోటోకాల్ కూడా ఇవ్వలేదు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి వివాదాలు రాలేదు. అయితే ఎన్నికల్లో పోటీ చేయాలన్న లక్ష్యంతోనే కొంత కాలంగా ఆమె తన ప్రయత్నాలను చేస్తున్నట్లుగా చెబుతున్నారు.