మల్కాజిగిరి లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులకు టికెట్ టెన్షన్ పట్టుకుంది. మల్కాజిగిరి అభ్యర్థిని ఎంపిక చేయడం కాంగ్రెస్‌కు కత్తి మీద సాములా మారినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి సిట్టింగ్ స్థానం కావడం, బలమైన అభ్యర్థులు లేకపోవడంతో ఎంపిక క్లిష్టంగా మారినట్టు సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ తమ అభ్యర్థులుగా రాగిడి లక్ష్మారెడ్డి, ఈటల రాజేందర్‌ను ప్రకటించాయి. బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుండగా.. రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తోంది.
మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఎల్బీనగర్, కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే మల్కాజిగిరి పార్ల మెంట్ స్థానానికి దీటైన అభ్యర్థిని రంగంలోకి దించాలని పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకత్వం ఆలోచిస్తోంది. లో రోజుకో పేరు తెరపైకి వస్తోంది. ఇప్పటి వరకు సినీనటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించినా, రెండు, మూడు రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తుంటే కొత్త వారు బరిలో ఉండేలా కనిపిస్తోంది. నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి, చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి పేర్లు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు పోటీలో ఉంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
వికారాబాద్ జెడ్పీ చైర్మెన్ సునీతా మహేందర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డిలో ఎవరికో ఒకరికి టికెట్టు దక్కేలా కనిపిస్తోంది. ఇక చేవేళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి పోటీ చేస్తారని తొలుత ప్రచారం జరిగిన సమయంలో బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ను బరిలో నిలవడంతో ఆయన చేవెళ్ల నుంచే పోటీ చేస్తానని అంటున్నారు. తనకు మల్కాజిగిరి సీటు కావాలని మర్రి జనార్ధన్ రెడ్డి హైకమాండ్ స్థాయిలో లాబీయింగ్ చేసుకుంటున్నారు. ఎవరికి ఇచ్చినా రేవంత్ చాయిస్ ను బట్టి ఉంటుందని అంచనా వేస్తున్నారు