బాలీవుడ్ స్టార్ అనుపమ్ లో ఓ నటుడే కాదు, దర్శకుడూ ఉన్నాడు. 2002లో ఓం జై జగదీష్ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ తరవాత ఇప్పుడు 22 ఏళ్ల తరవాత మళ్లీ మెగా ఫోన్ పట్టారు. ‘తన్వి ద గ్రేట్’ చిత్రంతో ఆయన తనలోని దర్శకుడ్ని మళ్లీ బయటకు తీసుకొచ్చారు. ఈ సినిమా కోసం కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా అనుపమ్ కీరవాణితో ఉన్న ఓ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. కీరవాణి సంగీతానికి అనుపమ్ పెద్ద ఫ్యాన్ అట. ఈ విషయాన్ని అనుపమ్ స్వయంగా చెప్పారు. క్రిమినల్ సినిమాలో ‘తు మిలే.. దిల్ ఖిలే’ (తెలుగులో తెలుసా.. మనసా) పాట విన్నప్పటి నుంచీ.. కీరవాణికి తాను పెద్ద అభిమానిని అయిపోయానని, ఆయనతో పని చేయడం ఓ అదృష్టమని చెప్పుకొచ్చారు అనుపమ్ ఖేర్. ఆస్కార్ అవార్డ్ విజేత తన టీమ్‌లో ఉండడం తనకో ఆశీర్వాదమని సంతోషపడిపోతున్నారు. హిందీలో పని చేయడం కీరవాణికి కొత్తేం కాదు. అక్కడ ‘క్రీమ్’ పేరుతో ఆయన సంగీతం అందిస్తుంటారు. అయితే… బాలీవుడ్ లో ఓ సినిమా చేసి కీరవాణికి చాలాకాలమే అయ్యింది. ‘ఆర్.ఆర్.ఆర్’తో ఆస్కార్ గెలుచుకోవడంతో ఇప్పుడు ఆయనకు బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. అనుపమ్ ఖేర్‌లాంటి లెజెండరీ నటుడి దర్శకత్వంలో పని చేసే అవకాశం కూడా ఇప్పుడు ఆస్కారే ఇచ్చిందనుకోవాలి. ఎంతైనా ఓ తెలుగువాడి స్వరం మళ్లీ బాలీవుడ్ లో వినిపించడం సంతోషించదగిన పరిణామమే.