బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యమ స్పీడుగా ఉన్నాడు. వరుసగా సినిమాల్ని పట్టాలెక్కిస్తున్నాడు. ‘టైసన్ నాయుడు’ చిత్రీకరణ దశలో ఉంది. ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ ఫేమ్ మున్నాతోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు మరో యువ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు. కౌశిక్ అనే దర్శకుడి కథకు బెల్లంకొండ ఓకే చెప్పాడు. కౌశిక్‌కు ఇది రెండో సినిమా. ఇదివరకు ‘చావు కబురు చల్లగా’ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆ సినిమా సరిగా ఆడలేదు. అయినా సరే… బెల్లంకొండ కౌశిక్ కు అవకాశం ఇవ్వడం విశేషం. ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మించనున్నారు.
అయితే… ‘టైసన్ నాయుడు’ ముగిసిన వెంటనే బెల్లంకొండ మరో సినిమా చేస్తాడు. అది పూర్తయ్యాకే కౌశిక్ సినిమా మొదలవుతుంది. ఈ సినిమాకీ ఓ యువ దర్శకుడ్ని పరిచయం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి కోడిరామకృష్ణ కుమార్తె దివ్య దీప్తి నిర్మాతగా వ్యవహరిస్తారు. ఆ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తారు. మరోవైపు రమేష్ వర్మ కాంబోలో ‘రాక్షసుడు 2’ కోసం ఎప్పుడో అడ్వాన్సులు తీసుకొన్నారు. ఆ సినిమా ఏ క్షణంలో అయినా పట్టాలెక్కొచ్చు. అంటే ఇప్పుడు బెల్లం ఖాతాలో ఏకంగా 5 సినిమాలున్నాయన్నమాట.