ఎట్టకేలకు రామ్ చరణ్ – బుచ్చిబాబు సినిమా పట్టాలెక్కబోతోంది. రేపు అంటే.. బుధవారం హైదరాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ ముహూర్తం వేడుకకు చిత్రబృందంతో పాటు కొంతమంది ప్రత్యేక అతిథులు హాజరు కాబోతున్నారని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ పక్కన జాన్వీ కపూర్ కథానాయికగా ఎంపికైంది. ఏ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. రేపు అఫీషియల్ గా క్లాప్ కొట్టినా, రెగ్యులర్ షూటింగ్ మాత్రం కాస్త ఆలస్యం కానుంది.
చరణ్ చేతిలో ‘గేమ్ ఛేంజర్’ ఉంది. అది పూర్తవ్వాలి. రెండింటినీ సమాంతరంగా షూట్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే.. రెండు సినిమాల్లోనూ వేర్వేరు గెటప్పుల్లో కనిపించాలి. గేమ్ ఛేంజర్ గెటప్ వేరు.. బుచ్చిబాబు సెటప్ వేరు. అందుకే ‘గేమ్ ఛేంజర్’ పూర్తయ్యేంత వరకూ బుచ్చిబాబు సినిమాని మొదలెట్టే అవకాశం లేకుండా పోయింది. ఈ సినిమాకి ‘పెద్ది’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ‘ఉప్పెన’ తరవాత వెంటనే ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాలి బుచ్చిబాబు. దానికి `పెద్ది` అనే టైటిలే అనుకొన్నారు. అదే కథని మార్చి.. ఇప్పుడు చరణ్‌తో తీస్తున్నాడు బుచ్చిబాబు. మరి… టైటిల్ అదే కంటిన్యూ అవుతుందా, లేదంటే కొత్త టైటిల్ ఏమైనా ప్రకటిస్తారా అనేది రేపు తేలిపోవచ్చు.