ఈ యేడాది సంక్రాంతికి విడుదలైన `హనుమాన్` బాక్సాఫీసు దగ్గర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వచ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్రత్యక్షమైంది. ఇక్కడా.. ‘హనుమాన్’ తన ప్రతాపం చూపిస్తూనే ఉంది. జీ 5లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా తొలి 11 గంటల్లోనే 102 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ని అధిగమించి కొత్త రికార్డుని సాధించింది. ఈ యేడాది విడుదలైన అన్ని భారతీయ చిత్రాల్లో, అతి తక్కువ సమయంలో ఈ మైలు రాయిని దాటిన సినిమా ఇదే. అంతేకాదు… గ్లోబల్ ట్రెండింగ్ లో ప్రస్తుతానికి నెంబర్ వన్‌గా కొనసాగుతోంది. ఓ తెలుగు సినిమా, అందులోనూ ఓ చిన్న సినిమా ఈ స్థాయి ఆదరణ దక్కించుకోవడం విశేషమే.
వాస్తవానికి ఓటీటీలో కాస్త ముందుగానే విడుదల అవ్వాల్సిన సినిమా ఇది. ఓ నెల రోజులు ఆలస్యంగా వచ్చింది. దాంతో మరింత క్రేజ్ సంతరించుకొంది. బాక్సాఫీసు వేటలో పెద్ద సినిమాల్ని సైతం వెనక్కి నెట్టిన ‘హనుమాన్’ ఇప్పుడు ఈ ఓటీటీ పరుగులోనూ పాత రికార్డులకు చెక్ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తేజా సజ్జా కథానాయకుడిగా నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ‘ఆక్టోపస్’ అనే ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆ తరవాత ‘హనుమాన్ 2’ని పట్టాలెక్కిస్తాడు. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించాలన్నది ప్రశాంత్ వర్మ కల. అందుకోసం బాలీవుడ్ నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని కూడా రంగంలోకి దించబోతున్నాడు.