బీఆర్ఎస్లో ఉండేది లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. పార్ట్ టైమ్ రాజకీయ నేతను.. పూర్తి స్థాయి వ్యాపారవేత్తనని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలకు రక్షణ కోసమైనా తాను కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరుతానని అంటున్నారు. తన మొదటి ప్రయారిటీ కాంగ్రెస్ అని.. చేర్చుకోకపోతే బీజేపీలో చేరుతానని అంటున్నారు.
మల్లారెడ్డి వ్యవహారం బీఆర్ఎస్ లో ఆశ్చర్యం కలిగించడంలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఎగిరెగిరి పడటంతో అధికారం పోగానే అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. వ్యాపారాలను అనేక లొసుగులతో నడిపించడమే కాదు.. కబ్జా ఆరోపణలు కూడా లెక్కలేనన్ని ఉన్నాయి. అదే సమయంలో రేవంత్ రెడ్డితో వ్యక్తిగతంగానూ వైరం పెంచుకున్నారు. తోడలు కొట్టి సవాళ్లు చేశారు. ఇప్పుడు పరిస్థితి మారడంతో ఒక్క సారిగా సమస్యలు చుట్టుముట్టాయి. రోజుకో వివాదం వెంటాడుతోంది. చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దవి అయి నెత్తికెక్కుతున్నాయి. తాజాగాఐటీ దాడులు కూడా ప్రారంభమయ్యాయి.
ఈ క్రమంలో మల్లారెడ్డి తాను ఇక బీఆర్ఎస్ పార్టీలో ఉండబోనని.. జాతీయ పార్టీల్లో చేరిపోతానని ఎవరు చేర్చుకున్నా చేరుతానని అంటున్నారు. తన ప్రయారిటీ కాంగ్రెస్ అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆయనను చేర్చుకుంటుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. కాంగ్రెస్ చేర్చుకోకపోతే…బీజేపీలో చేరుతానని ఆయన హెచ్చరిస్తున్నారు. మల్లారెడ్డి తీరు చూసి ఇంత బలహీన మనస్థత్వంతో రాజకీయాల్లో ఎలా మనగలుగుతారన్న ప్రశ్నలు బీఆర్ఎస్ వైపు నుంచి వస్తున్నాయి.