విజువల్ ఎఫెక్ట్స్ విలువెంతో, దాంతో ఏమేం చేయొచ్చో తెలిశాక.. వెండి తెరపై సరికొత్త ప్రపంచాల్ని సృష్టించడానికి దర్శకులు పోటీ పడడం మొదలెట్టారు. ఆ కోవలో శివ కూడా చేరిపోయాడు. యాక్షన్ సినిమాలతో కెరీర్ ని ముందుకు నడిపించిన శివ ఇప్పుడు ఓ వినూత్నమైన కథాంశంతో, ఇది వరకెప్పుడూ చూడని విజువల్స్ తో మెస్మరైజ్ చేయడానికి ముందుకొచ్చాడు. అదే.. ‘కంగువా’. సూర్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ అత్యంత భారీ వ్యయ ప్రయాసలతో నిర్మిస్తోంది. బాబీ డియోల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ‘కంగువా’కి సంబంధించిన గ్లింప్స్ ఈరోజు విడుదల చేశారు.
ఆధ్యంతం… గుడ్లప్పగించి చూసేలా ఓ సరికొత్త ప్రపంచాన్ని తెరపైకి తీసుకొచ్చాడు శివ. పాత్రధారుల రూపు రేఖలు, కాస్ట్యూమ్స్, యుద్ధ రీతి, ఆ వాతావరణం, జంతువులు, ఆయుధాలూ… ఒక్కటేమిటి? అన్నీ ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్ద పీట వేశారు. గ్రాఫిక్ డిజైనర్ల కష్టం, దర్శకుడి తాలూకూ విజువలైజేషన్ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. చివర్లో బాహుబలిలో ప్రభాస్, రానా బాహా బాహీ తలపడిన షాట్ లాంటిది లేకపోతే.. ఇంకొంచెం బాండేది. మొత్తానికి ‘కంగువా’తో తానేం చెప్పదలచుకొన్నాడో, ఏం చూపించాలనుకొన్నాడో ఈ గ్లింప్స్ ద్వారా చెప్పేశాడు శివ. ఈ గ్లింప్స్‌తో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరగడం ఖాయం.