కాంగ్రెస్ గెట్లేత్తడంతో తాము కూడా లైన్లో ఉన్నామని ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు సంకేతాలు పంపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నాయకత్వంతో సంప్రదింపులు పూర్తయ్యాయి. ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. వీరిలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు ఉన్నారు. వీరంతా వివిధ కారణాలతో కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.
గతంలో రేవంత్ తో మర్యాదపూర్వక భేటీ అయిన వారిలో వీరు కూడా ఉన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పేరు కూడా ప్రచారంలో ఉంది. గతంలో సీఎంతో మర్యాదపూర్వక భేటీ అయిన వారిలో ఈమె కూడా ఉన్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ లో ఉన్న సునీత లక్ష్మారెడ్డి.. బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు మళ్లీ ఆమె కాంగ్రెస్ లోకి చేరాలని ఆమెను ఆహ్వానిస్తున్నారు. ఇంకా ఎలాంటి నిర్ణయం ఆమె వైపు నుంచి రాలేదు.
ఇక కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరనుండటం ఆసక్తికరంగా మారింది. ఆయనకు ఉన్న వ్యాపారాలు, ఇతర లొసుగుల వల్ల … పార్టీ మారక తప్పడం లేదంటున్నారు. గూడెం మహిపాల్ రెడ్డిదీ అదే పరిస్థితి. ఆయన సోదరుడ్ని ఇటీవల అక్రమ మైనింగ్ లో పోలీసులు అరెస్టు చేశారు. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ రెండు స్థానాలే గెల్చినప్పటికీ ఫిరాయింపులతో… సిద్ధిపేట, గజ్వేల్లు తప్ప మిగిలిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.