సినిమా సంగతులు ఎప్పుడూ ఆసక్తికరమే. అందుకే సినిమాలు, సెలబ్రీటీల నేపథ్యంలో ఎన్నో చిత్రాలు వచ్చాయి. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఇప్పుడు ‘షో టైం’ అనే వెబ్ సిరిస్ తో మరోసారి తెర వెనుక కథలు చెప్పే ప్రయత్నం చేశాడు. నసీరుద్దీన్ షా, ఇమ్రాన్ హష్మీ, శ్రియా శరణ్, మౌని రాయ్ లాంటి ప్రముఖ తారాగణం ప్రధాన పాత్రలతో పాటు జాన్వి కపూర్, మృణాల్ ఠాకూర్ లాంటి ఇంకెంతో మంది స్టార్స్ అతిధి పాత్రల్లో మెరిసిన ఈ సిరిస్ డిస్నీ హాట్ స్టార్ వేదికగా విడుదలైయింది. మరి ఈ షో టైంలోని విశేషాలేమిటి? ఇందులో చూపించిన బాలీవుడ్ తెరవెనుక కథలు ప్రేక్షకులని అలరించాయా?
విక్టర్ ఖన్నా (నసీరుద్దీన్ షా) వెటరన్ నిర్మాత. విక్టర్ స్టూడియోస్ అధినేత. సినిమా అంటే వ్యాపారం కాదు అదొక ధర్మం అనేది విక్టర్ ఖన్నా సిద్ధాంతం. అయితే కాలం మారుతుంది. గతంలో ఎన్నో కళాత్మక చిత్రాలు తీసి ప్రేక్షకులని రంజిపచేసిన విక్టర్ కు వరుసగా అపజయాలు ఎదురౌతాయి. అయినా తన అభిరుచిలో మాత్రం మార్పు రాదు. తను ప్రోస్తటిక్ క్యాన్సర్ తో ఇబ్బంది పడుతుంటాడు. అనారోగ్యం కారణంగా సినిమాల్లో ఇన్ యాక్టివ్ అవుతాడు. విక్టర్ కొడుకు రఘు ఖన్నా (ఇమ్రాన్ హష్మీ). రఘు. తండ్రిలా కాదు. పక్కా బిజినెస్ మ్యాన్. సినిమా అట్టర్ ఫ్లాఫ్ అయినా పర్లేదు. వందకోట్ల మార్క్ దాటించడమే అతని లక్ష్యం. రివ్యూలని పట్టించుకోడు. కథా బలం లేకుండా కేవలం కమర్షియల్ హంగులతో సినిమాలు తీసి డబ్బు చేసుకోవడం అతని స్టయిల్. రఘు పద్దతి నచ్చక చాలా సార్లు తండ్రి వారిస్తాడు. అయినా పట్టించుకోడు. రఘు నిర్మించిన ఓ సినిమాని రివ్యూ చేసి జీరో స్టార్ ఇస్తుంది సినీ జర్నలిస్ట్ మహికా నంది(మహిమా మక్వానా). దాంతో ఆ టీవీ యాజమాన్యంతో ఒత్తిడి తెచ్చి ఆమె ఉద్యోగాన్ని తీయించేస్తాడు రఘు. ఇంతలో విక్టర్ ఖన్నా తన అనారోగ్య బాధల్ని భరించలేక ఆత్మహత్య చేసుకుంటాడు. తను చనిపోవడానికి ముందు ఓ విల్లు రాస్తాడు. ఆ విల్లు ప్రకారం స్టూడియోలో సర్వహక్కులు సినీ జర్నలిస్ట్ మహికా నంది పేరు మీద రాసేస్తాడు. అసలు విక్టర్ ఖన్నా అలా ఎందుకు చేశాడు? తనకి, మహికాకి వున్న అనుబంధం ఏమిటి ? మహికా స్టూడియో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? తనకి, రఘుకి ఎలాంటి పోటీ ఏర్పడింది ? ఇవన్నీ తెరపై చూడాలి.
బాలీవుడ్ నిర్మాణ రంగం నేపధ్యంలో రూపొందిన సిరిస్ ఇది. తొలి సీజన్ లో నాలుగు ఎపిసోడ్లు రిలీజ్ చేశారు. ఒక్కొక్క ఎపిసోడ్ నిడివి దాదాపు నలభై నిమిషాలు. వీటిలో నిర్మాణం రంగంలోని ఆసక్తికరమైన అంశాలతో పాటు సినిమా వ్యాపారం, రివ్యూలు, తెరవెనుక కుట్రలు, చీకటి కోణాలు, అవకాశాలని హైజాక్ చేసే తీరు ఇలా పలు అంశాలు సృశిస్తూ సిరిస్ సాగుతుంది. నసీరుద్దీన్ షా లాంటి మేటి నటుడి ప్రజెన్స్ తో తొలి ఎపిసోడ్ ఆసక్తికరంగా మొదలౌతుంది. సినిమాని ఒక ధర్మంగా భావించే ఒక పాత్ర, దానికి విరుద్దంగా సినిమా అంటే పక్కా బిజినెస్ గా మాత్రమే అనుకునే రఘు పాత్రలలో వున్న సంఘర్షణ ఎంగెజింగ్గానే వుంటుంది. తొలి ఎపిసోడ్ లో ఇది సినిమాలకి రివ్యూలకి మధ్య జరిగే కథలా అనిపిస్తుంది. అయితే రెండో ఎపిసోడ్ నుంచి కథ కేవలం నిర్మాణ రంగంవైపు తిరుగుతుంది.
తొలి రెండు ఎపిసోడ్స్ లో వున్న ఆసక్తి మిగతా రెండు ఎపిసోడ్స్ కనిపించదు. రఘు సొంతగా స్టూడియోపెట్టడం, మహికా తన బ్యానర్ ని నిలబెట్టడం కోసం ప్రయత్నించడం, హీరో డేట్స్ కోసం ఇద్దరూ పోటిపడటం… ఈ సన్నివేశాలన్నీ నిదానంగా నింపాదిగా సాగుతుంటాయి. అవసరానికి మించి సాగదీస్తున్నారనే ఫీలింగ్ ప్రేక్షకులకూ కలుగుతుంది. విక్టర్ ఖన్న, మహికా నందిల అనుబంధం కాస్త సినిమాటిక్ లిబర్టీలా అనిపిస్తుంది. తను కోరుకున్నది దక్కించుకోడం కోసం దేనికైనా తెగించే రఘు, తన భార్య కోసం లాక్ చేసిన సినిమాని హీరో భార్యకి ఇచ్చేయడం, ఆమె కూడా మారుమాట లేకుండా తీసుకునే వైనం చూసినప్పుడు సినిమా పరిశ్రమలో అవకాశాలు ఎలా హైజాక్ అవుతాయో అర్ధమౌతుంది. ఇందులో ఇండస్ట్రీపై వేసిన సెటర్లు కూడా వున్నాయి. పాన్ యాడ్ లో నటిస్తేనే సూపర్ స్టార్ అయినట్లు అని పలికించిన సంభాషణ అజయ్ దేవ్ గణ్, షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ లకు తగులుతుంది. ఇందులో మెచ్చుకునే ఓ విషయం కూడా వుంది. సాధారణంగా బాలీవుడ్ ఎవరి ఆధిపత్యం భరించదు. కానీ ఇందులో ఓ సీన్ లో సౌత్ పరిశ్రమ ఎంత డామినేట్ చేస్తుందో, ఎంతలా ముందుకు దూసుకుపోతుందో చూపించారు.
ఈ సిరిస్ కి స్పెషల్ ఎట్రాక్షన్ ఇందులో కనిపించిన స్టార్స్. నసీరుద్దీన్ షా ప్రజన్స్ ఆకట్టుకునేలా వుంటుంది. ఆయన ఉన్నంతసేపు ఎంగేజింగ్ గా ఉంచారు. ఇమ్రాన్ హష్మీ కొంచెం నెగిటివ్ టచ్ వున్న పాత్ర. ఆయనని అలాంటి పాత్రలు అలవాటే. అయితే ఇందులో ఆయన పాత్రలకు శ్రుతిమించిన డైలాగులు ఎక్కువైపోయాయి. మహికా నంది పాత్రలో మహిమా మక్వానా సహజంగా కనిపించింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అర్మాన్ సింగ్ గా రాజీవ్ ఖండేల్వాల్ నటన ఆకట్టుకుంటుంది. ఆయన ప్రదర్శించిన హీరో యాటిట్యూడ్ బావుంది. అర్మాన్ భార్య గా కనిపించింది శ్రియా. తన స్క్రీన్ ప్రజెన్స్ కూడా ప్రామెసింగ్ గా వుంది. ఇమ్రాన్ భార్య కనిపించిన మౌనీరాయ్ ది రొటీన్ పాత్రే అయినప్పటికీ ఆ పాత్రని గ్లామర్ డోస్ కోసం వాడుకునట్లగా అనిపించింది. జన్వీ కపూర్, ముర్నాల్ తో పాటు చాలా మంది తారలు అతిధి పాత్రల్లో మెరిసారు. కరణ జోహార్ వలనే అది సాధ్యపడింది.
మ్యూజిక్, కెమరాపనితనం, ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా వున్నాయి. దర్శకుడు మిహిర్ దేశాయ్, అర్చిత్ కుమార్ చివరి రెండు ఎపిసోడ్ల కంటెంట్ ను ఇంకాస్త పదును పెట్టాల్సింది. సినిమా పరిశ్రమ సంగతులు, తెర వెనుక కథలపై ఆసక్తి వున్నవారు సమయం కుదిరినప్పుడు ఓ సారి చూడొచ్చు.