కవిత ను జైలు నుంచి బయటకు తెప్పించేందుకు కేటీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. సీనియర్ల లాయర్ల సాయంతో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఈడీ తీరును నిరసిస్తూ… మొత్తం 537 పేజీల సమగ్ర వివరాలతో కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు సోమవారం ఉదయం సుప్రీంకోర్టులో ఫ్రెష్ పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ ఈ అంశంపై సుదీర్ఘమైన కసరత్తు జరిపారు.
కేటీఆర్ న్యాయపరమైన అంశాలపై నిపుణులతో చర్చించేందుకు ఢిల్లీలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. కస్టడీలో ఉన్న కవితను మంగళవారం కేటీఆర్ ఒక్కరే కలిశారు. తొలిరోజైన ఆదివారం భర్త అనిల్, హరీశ్ రావులతో కలిసి కేటీఆర్ కవితను పరామర్శించారు. సోమవారం కేటీఆర్, హరీశ్‌రావులు వెళ్లగా… మంగళవారం మాత్రం కేటీఆర్ ఒక్కరే కలిసి మాట్లాడారు. కవిత భర్త అనిల్ కు ఈడీ నోటీసులు ఇవ్వడంతో తాను పది రోజుల వరకూ హాజరు కానని రిప్లై ఇచ్చారు. ఈ కారణంగా ఈడీ ఆఫీసుకూ రాలేకపోతున్నారు.
నిబంధనల ప్రకారం… సాయంత్రం 5 గంటలకు కవిత విచారణ సమయం ముగిసింది. 5:30 కి వైద్యుల బృందం రోజువారీ సాధారణ వైద్య పరీక్షలు చేశారు. ఆరు గంటలకు దర్యాప్తు చేస్తోన్న డిప్యూటీ డైరెక్టర్ భాను ప్రియ మీనా ఈడీ ఆఫీసు నుంచి వెళ్లి పోయారు. కాగా, మంగళవారం విజిటింగ్ సమయంలో మార్పులు జరిగాయి. 6 నుంచి 7 గంటల మధ్య కుటుంబ సభ్యులను కలిసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.