ఏపీ బీజేపీ సీట్ల పంచాయతీ ఢిల్లీ చేరింది. తమలో తాము తేల్చుకోలేక చంద్రబాబు మోసం చేస్తున్నారంటూ.. ఆటు వైపు నుంచి నరుకొచ్చేందుకు ప్రో వైసీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కేంద్ర నేతల సంప్రదింపుల్లో ఆరు ఎంపీ, పది అసెంబ్లీ సీట్లను ఖరారు చేసుకున్నారు. వాటిపై ఓ స్పష్టత వచ్చాక కేంద్ర నేతలు వెళ్లిపోయారు. ఇక్కడ అభ్యర్థుల్ని ఖరారు చేసుకునే సమయంలో.. ప్రో వైసీపీ నేతలెవరికీ టిక్కెట్లు దక్కే అవకాశాలు లేవని తేలిపోయింది. తమకు చాన్స్ దక్కకుండా నియోజకవర్గాలను ఖరారు చేసుకున్నారంటూ బీజేపీ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.
ఓ పది మంది హైకమాండ్ కు లేఖ రాశారు. అందులో.. టీడీపీ మోసం చేస్తోందని.. కొంత మంది టీడీపీ నుంచి వచ్చిన వారు కూడా బీజేపీతో కలిసి మోసం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. పార్టీని నమ్ముకున్న వారికి టిక్కెట్లు దక్కనీయడం లేదంటున్నారు. వీరి ఉద్దేశం ప్రకారం.. పార్టీని నమ్ముకున్న వారు వారే… వారితో పాటు వారి వెనుక ఉన్న కొంత మంది సీనియర్లు కూడా. సోము వర్రాజు, జీవీఎల్ వంటి వారన్నమాట.
ఈ లేఖ ఎఫెక్టో లేకపోతే మరో కారణమో కానీ పురందేశ్వరి ఢిల్లీ వెళ్లారు. అభ్యర్థులను ఖరారు చేయించడానికి వెళ్లారని.. సీట్లపై స్పష్టత ఉందని.. మార్పులేమీ ఉండవని చెబుతున్నారు. కానీ కొంత మంది సీనియర్ నేతలు మాత్రం.. వారికి చాన్స్ వచ్చేలా చేసుకోవడానికి నియోజకవర్గాలు మార్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు రోజుల్లో బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది.