‘ఉస్తాద్ భగత్‌సింగ్’ నుంచి మంగళవారం ఓ టీజర్ వచ్చింది. నిజంగానే పవన్ అభిమానులకు ఊహించని గిఫ్ట్ ఇది. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాదనుకొన్నారు. కానీ సడన్ గా టీజర్ వచ్చి పడిపోయింది. టీజర్లో గాజు డైలాగ్… సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. జనసేన గుర్తు గాజు గ్లాసు కావడంతో ఈ డైలాగ్ కు మరింత రీచ్ వచ్చింది. అయితే ఇప్పుడు అదే డైలాగ్ ఈ టీజర్‌ని చిక్కుల్లో పడేసింది.
టీజర్లో గాజు గ్లాసు డైలాగ్ ఎలక్షన్ కమీషన్ వరకూ వెళ్లింది. ప్రస్తుతం ఏపీలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ప్రకటనలు ఏమైనా విడుదల చేయాలనుకొంటే, ఎలక్షన్ కమీషన్ అనుమతి తప్పనిసరి. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ టీజర్ వెనుక రాజకీయ ప్రచారం ఉద్దేశ్యం ఉంటే గనుక.. టీజర్‌ని తక్షణం ఆపేయాలి. దీన్నో సినిమాగా మాత్రమే చూస్తే అలాంటి గొడవలేం ఉండదు. టీజర్ విషయంలో ఎవరూ కంప్లైంట్ చేయలేదని, ఒకవేళ ఆ టీజర్ వెనుక తమ గాజు గ్లాసు గుర్తుని ప్రచారం చేసుకొనే ఉద్దేశం ఉందని తెలిస్తే, అప్పుడు ఈ విషయంలో ఏం చేయాలో ఆలోచిస్తామని ఎలక్షన్ కమీషన్ అంటోంది. ‘ఉస్తాద్’లో పవన్ కల్యాణ్ రాజకీయ నాయకుడు కాదు. ఎన్నికల ప్రస్తావన ఎక్కడా లేదు. జనసేన సింబల్ అయినంత మాత్రాన.. గాజు గ్లాసు ని చూపిస్తే, అది ఎన్నికల ప్రచారం కోసమే అనుకోవడం పొరపాటే. ఇది వరకు కూడా పవన్ చాలా సినిమాల్లో గాజు గ్లాసు పట్టుకొని దర్శనమిచ్చాడు. అంతెందుకు ‘గబ్బర్ సింగ్’లోని ఓ సీన్లో పవన్ చేతిలో గాజు గ్లాసు కనిపిస్తుంది. అప్పటికి జనసేన లేదు. గాజు గ్లాసు గుర్తూ లేదు.