ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పెద్దలు సర్దుకుంటున్నారు. పెండింగ్ ఏమీ లేకుండా ఊడ్చేసుకుంటున్నారు. చిన్న చిన్న కాంట్రాక్టర్ల సంగతిని పక్కన పెట్టి తమ పార్టీ అగ్రనేతలకు.. వారి బినామీలకు పెండింగ్ బిల్లులు ఏమైనా ఉంటే.. వేల కోట్లు చెల్లించేసుకుంటున్నారు. ఈ ఒక్క నెల ఆర్బీఐ దగ్గర ఓవర డ్రాఫ్ట్ తెచ్చి మరీ పెద్ద ఎత్తున చెల్లింపులు చేశారు. బడాబాబులకు రూ. ఏడు వేల కోట్లు చెల్లింపులు చేసినట్లుగా తెలుస్తోది. కోడ్ రాక ముందే పెద్ద చెల్లింపులు పూర్తి కాగా.. కోడ్ వచ్చిన తర్వాత కూడా ఆ ప్రక్రియ కొనసాగుతోంది.
నిజానికి బటన్ నొక్కిన పథకాలకు అకౌంట్లలో డబ్బులు పడాల్సి ఉంది. ఆ డబ్బులన్నీ వినియోగిస్తే… పథకాలకు డబ్బులు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ రెండు వారాల తర్వాత డబ్బులు పడతాయని చెప్పి.. ఇప్పుడు సొంత వారికి నిధులు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం వస్తుందన్న నమ్మకం లేకపోవడంతో పార్టీ తరపున పని చేసేవారు కూడా తమకు రావాల్సిన డబ్బులన్నీ ఇప్పుడే ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. ఎలాగూ విడుదల చేసే ప్రతి బిల్లులోనూ కమిషన్లు తీసుకుంటారు. దీంతో ఎన్నికల ఖర్చు మిగిలిపోతుదంని అనుకుంటున్నారు.
బిల్లులే కాదు.. కొన్ని విషయాల్లో తాము చట్టపరంగా ఇరుక్కోకుండా ఉండటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వాలంటీర్ల పేరుతో ఏటా రూ. అరవై కోట్ల కట్టబెట్టిన FAO అనే సంస్థకు కాంట్రాక్ట్ ను ఈ ఏడాది పొడిగించలేదు. పూర్తి స్థాయిలో వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు చేసిన సమాచార సేకరణను ఈ కంపెనీనే క్యాప్చర్ చేసేది. వాలంటీర్లకు పని నిర్ణయించేది ఈ కంపెనీనే. ఈ కంపెనీ కాంట్రాక్ట్ పొడిగించలేదు. కానీ.. పని మాత్రం చేస్తున్నారు. అలాగే విద్యా కానుక లాంటి కాంట్రాక్టులను కూడా ఇచ్చేస్తున్నారు. ఇక భూములు కావాల్సిన వాళ్లు ఇప్పటికే దరఖాస్తులు పెట్టుకున్నారు. వాటిని సీక్రెట్ గా పరిష్కరించేస్తున్నారు.
వైసీపీ నేతల తీరు చూస్తే… దొరికినంత దండుకుని వెళ్లిపోదామన్నట్లుగా ఉందని సచివాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్క వ్యవస్థా సక్రమంగా పనులు చేయలేదు. ఆర్థిక నిర్వహణ అత్యంత ఘోరం.. వచ్చినవి..తెచ్చినవి నిధులన్నీ లెక్కాపత్రం లేకుండా ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ లెక్కలతో ఎంత మంది బలవుతారో కానీ.. ఇప్పటికే.. వీలైనంతగా ఊడ్చుకుని సర్దుకుపోవడం బెటరనుకుంటున్నట్లుగా పనులు జరుగుతున్నాయి.