రాజమండ్రిలో మొన్న బీజేపీ బారీ బహిరంగ సభను నిర్వహించడం మిత్రపక్షమయిన తెదేపా జీర్ణించుకోవడం కష్టమే. ఎందుకంటే అది రాష్ట్రంలో తెదేపాకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఎదిగేందుకు బీజేపీ చేసిన తొలి ప్రయత్నం కనుక. అంతే కాదు రాష్ట్రంలో తమ పార్టీపై జరుగుతున్న దుష్ప్రచారానికి సమాధానం చెప్పడానికే వచ్చేనని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సభలో చెప్పడం మరొక షాక్ అనుకొంటే, రాష్ట్రంలో అమలవుతున్న వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి, సంక్షేమ పధకాల కోసం ఈ 22 నెలల వ్యవధిలో తమ ప్రభుత్వం రాష్ట్రానికి మొత్తం 1.40 లక్షల కోట్లు మంజూరు చేసిందని ఆయన చెప్పడం అంతకంటే పెద్ద షాక్ అని చెప్పవచ్చును. ఎందుకంటే రాష్ట్ర విభజన కారణంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తగినన్ని నిధులు విడుదల చేయడం లేదనట్లు తెదేపా నేతలు మాట్లాడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు 1.40 లక్షల కోట్లు మంజూరు చేసినట్లు అమిత్ షా బహిరంగ సభలో బయటపెట్టారు.
ఆయన చెప్పిన ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా తెదేపా మంత్రులు, నేతలు ఎవరూ కూడా ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం. అమిత్ షా చెప్పిన దానిని అంగీకరిస్తే ఇంత కాలం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టినట్లవుతుంది. అలాగని ఖండిస్తే బీజేపీకి, కేంద్రప్రభుత్వానికి ఆగ్రహం కలిగించినట్లవుతుంది. కనుకనే తెదేపా నేతలు అసలు ఆ బీజేపీ సభ ఊసే ఎత్తడంలేదనుకోవలసి ఉంటుంది. త్వరలో ఉత్తరాంద్ర, రాయలసీమలో కూడా మరో రెండు బహిరంగ సభలు నిర్వహిస్తామని రాష్ట్ర బీజేపీ నేతలు ఇదివరకే ప్రకటించారు.