సికింద్రాబాద్ లోక్ సభ క్యాండిడేట్స్ విషయంలో అన్ని పార్టీల్లోనూ అయోమయం నెలకొందా…? బీఆర్ఎస్సే కాదు కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరో కూడా కిషన్ రెడ్డి డిసైడ్ చేయబోతున్నారా…? ఫ్యూచర్ పాలిటిక్స్ దృష్టిలో పెట్టుకొని కిషన్ రెడ్డి మాట పక్క పార్టీల్లోనూ చెల్లుబాటు అవుతోందా…? తెలంగాణ పాలిటిక్స్ చూస్తే అవే అనుమానాలు మొదలవుతున్నాయి.
తెలంగాణలో మెజారిటీ లోక్ సభ స్థానాలను గెలుస్తామని కాంగ్రెస్ నమ్మకంగా చెప్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఓ అడుగు ముందుకేసి 14 స్థానాలు గెలిచి తీరుతామని, ఈ ఎన్నికలు తమ 100రోజుల పాలనకు రెఫరెండం అంటూ ప్రకటించారు. పక్క పార్టీల నుండి నేతలను తీసుకరావటం అన్నీ చూస్తే నిజమేనని అనిపించినా, సికింద్రాబాద్ అభ్యర్థి విషయానికి వచ్చే సరికి మాత్రం అనేక అనుమానాలు మొదలవుతున్నాయి.
సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరోసారి పోటీలో ఉన్నారు. సికింద్రాబాద్ లో పైగా బీజేపీ టికెట్ అనగానే అడ్వాంటేజ్ కనిపిస్తున్న కాంగ్రెస్ కు ఈసారి గెలిచే ఛాన్స్ ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. బీఆర్ఎస్ గెలవకపోయినా ఓట్లు చీల్చుతుందనేది ఓపెన్ సీక్రెట్.
కానీ, ఇక్కడే కిషన్ రెడ్డి తన చతురత మొదలుపెట్టారని… కేంద్రంలో రాబోయేది బీజేపీ కూటమి సర్కారే కాబట్టి గెలిస్తే తాను మరోసారి మంత్రి అవుతానన్న ఉద్దేశంతో ఇక్కడున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ లో తన స్నేహాన్ని ఉపయోగించుకొని డమ్మీ అభ్యర్థులను దింపేలా ప్రయత్నిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.
బీఆర్ఎస్ నుండి తలసాని కొడుకు సాయి కిరణ్ నిలబడతారని ప్రచారం చేసి చివరకు తలసానియే నిలబడతారు అని పార్టీ వర్గాలంటున్నాయి. తాజాగా పద్మారావు పేరును తెరపైకి తెచ్చారు. నిజానికి వీళ్లు గెలవలేరు అనేది ఓపెన్ సీక్రెట్. ఇటు కాంగ్రెస్ లో కూడా మొదట బొంతు రామ్మోహన్ పేరు గట్టిగా వినిపించింది. తాజాగా దానం పేరు వినిపిస్తుంది. నిజానికి దానం అయినా, పద్మారావు అయినా, తలసాని అయినా గెలిచే స్థాయి కాదు. పైగా వాళ్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఖర్చు చేసి గెలవాలన్న కసితో లేరు. అయినా వాళ్లకే టికెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఎలాగైనా చట్టసభలో అధ్యక్షా అనాలన్నా బొంతు ఆశలు నెరవేరేలా లేవు.
నిజానికి అధికారంలో ఎవరున్నా కిషన్ రెడ్డి పర్సనల్ గా అందరితో సఖ్యతగా ఉంటారని… రేపటి రోజు బీజేపీ లేదా కేంద్రంతో సఖ్యత కావాలనుకుంటే నాయకులకు తాను ఉంటాడన్న ఉద్దేశంతో కిషన్ రెడ్డిపై గెలిచే అభ్యర్థులను బరిలోకి దింపటం లేదేమోనన్న అనుమానాలు రాజకీయ విశ్లేషకుల నుండి, ఆయా పార్టీల క్యాడర్ నుండి వినపడుతున్నాయి. ఇటు కేసీఆర్, అటు రేవంత్ రెడ్డి ఫ్యూచర్ పాలిటిక్స్ కోసం కిషన్ రెడ్డితో వైరానికి పోవటం లేదని భోగట్టా!