ఐపీఎల్ ముంగిట.. ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చాడు చెన్నై సూపర్ కింగ్స్ సారధి ధోని. తన కెప్టెన్సీని వదులుకొని, కొత్త సారధికి ఆ బాధ్యత అప్పగించాడు. ఈ సీజన్లో రుతురాజ్ గ్వైకాడ్ చెన్నైని నడిపించనున్నాడు. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఓ కీలక ప్రకటన జారీ చేసింది. కెప్టెన్ గా ధోనీ లేకపోవడం అభిమానులకు నిరాశే. అయితే.. ఆటగాడిగా మాత్రం ధోనీ జట్టుతో కొనసాగుతాడు. వచ్చే ఐపీఎల్ కు ధోనీ అందుబాటులో ఉండే అవకాశాలు లేవు. అందుకే ఈలోగా ఓ కొత్త సారధిని వెదికి పట్టుకోవాలి. ధోనీ ఫీల్డ్ లో ఉన్నప్పుడే ఆ పని జరగాలి. అందుకే చెన్నై ఈ కీలక నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. ఈసారి ఐపీఎల్ లో కొత్త పాత్ర పోషించబోతున్నా.. అని ధోనీ ఇది వరకే హింట్ ఇచ్చాడు. దాంతో ధోనీ పాత్రపై సర్వత్రా ఆసక్తికరమైన చర్చ నడిచింది. ఎట్టకేలకు ఈ విషయంపై ఓ స్పష్టత వచ్చింది. చెన్నైని ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలబెట్టాడు ధోనీ. బ్యాటర్‌గా, కీపర్‌గా, కెప్టెన్ గా త్రిపాత్రాభినయం చేస్తూ ఎన్నో విజయాల్ని కట్టబెట్టాడు. ధోనీపై ఒత్తిడి తగ్గించడానికే చెన్నై ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. ధోనీ అధికారిక కెప్టెన్ కాకపోయినా, గ్రౌండ్ లో తన సలహాలూ, సూచనలూ తప్పకుండా అందిస్తాడు. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. మరి కొత్త సారధి రుతురాజ్ గైక్వాడ్ చెన్నైని ఇక మీదట ఎలా నడిపిస్తాడో చూడాలి.