సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ విశాఖ ఎంపీ సీటు నుంచి పోటీ చేస్తానని అదే పనిగా చెబుతూ వస్తున్నారు. కానీ హఠాత్తుగా ఎమ్మెల్యే సీటుకు ఫిక్సయ్యారు. సొంత పార్టీ పెట్టుకున్న ఆయన విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని అంటున్నారు. అందు కోసం బరిలోకి దిగారు. ఉత్తర నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. దీనికి కారణం నియోజకవర్గంలో కాపు ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. వీరితో పాటు మేధావి వర్గం తనకు మద్దతు తెలుపుతోందని, గత ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసిన ఆయన ఉత్తర నియోజకవర్గం నుంచే ఓట్లు ఎక్కువ ఓట్లు పడ్డాయని ఆ ఓటు బ్యాంకు అలాగే ఉందని భావిస్తున్నారు. ఉత్తరంలో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో దాదాపు 2 లక్షల 87 వేల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. అధికార వైసీపీ మాత్రం ఇంతవరకు బోణీ కొట్టలేదు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో ఏర్పడిన విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి తొలిసారిగా కాంగ్రెస్ అభ్యర్థి తైనాల విజయ్ కుమార్ గెలుపొందారు. 2014లో బీజేపీ అభ్యర్థి పెనుమత్స విష్ణుకుమార్ రాజు విజయం సాధించగా… 2019లో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాస్ గెలిచారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో వైసీపీ పరాజయాన్ని చవిచూసింది.
విశాఖపట్నం అర్బన్‌లో కొంత భాగంతో పాటు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లోని 41,44, 45, 49, 50, 51 వార్డులు ఉన్నాయి. విశాఖ ఉత్తర నియోజకవర్గం లో అధికార వైసీపీ నుంచి కేకే రాజు ఎన్నికల బరిలో దిగగా… టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి నుంచి బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పోటీ చేస్తున్నారు. వీరి మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని భావించినప్పటికీ అనూహ్య రీతిలో వీవీ లక్ష్మీనారాయణ పోటీలో దిగారు. ఎన్ని ఓట్లు.. ఎవరి ఓట్లు చీలుస్తారో మరి !