తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది. గత కొద్ది రోజుల నుంచి భట్టి విక్రమార్కకు ప్రభుత్వంలో ప్రాధాన్యం తగ్గుతోందని గుసగుసలుప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి భట్టికి రేవంత్ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఎక్కడకు వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లే వారు. ప్రభుత్వం తరపున ఇచ్చే ప్రకటనల్లో రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్కకు ప్రాధాన్యం లభించేది. ప్రజాభవన్ గా మార్చిన ప్రగతి భవన్ లో గతం లో కేసీఆర్ ఉన్న భవనాన్ని భట్టి విక్రమార్కకు కేటాయించారు. కానీ రేవంత్ మాత్రం సొంత ఇంట్లోనే ఉంటున్నారు.
ముఖ్యమంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నించిన భట్టి విక్రమార్కకు… ఆ స్థాయి గౌరవం మొదటి నుంచి లభించింది. పత్రికల్లో .. కూడా రేవంత్ తో పాటు భట్టి విక్రమార్క ఫోటో కనిపించేది. ప్రతీ కార్యక్రమంలోనూ భట్టి విక్రమార్క కనిపించేవారు. అయితే ఈ ప్రాధాన్యత రెండున్నర నెలలే. ఇప్పుడు భట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి పక్కన పెద్దగా కనిపించడం లేదు. అంతకు మించి ప్రభుత్వ పరమైన ప్రకటనల్లోనూ ఆయన ఫోటో కనిపించడం మానేసింది. దీంతో కాంగ్రెస్‌లోనే రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
భట్టి విక్రమార్క సతీమణి నందిని ఖమ్మం టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఆమె మీడియా ఇంటర్యూల్లో రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ అయింది. భట్టికి రావాల్సిన సీఎం సీటు రేవంత్ తీసుకున్నారన్నట్లుగా మాట్లాడుతున్నారు. భట్టి కేంద్రంగా రేవంత్ ను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇదంతా రాజకీయ ప్రచారమేనని భట్టికి ఎలాంటి ప్రాధాన్యం తగ్గలేదని.. భట్టికి ఉన్న శాఖలకు సంబంధించిన ప్రకటనలు వచ్చినప్పుడు ఆయన ప్రాధాన్యం ఉంటోందని కాంగ్రెస్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. కాంగ్రెస్ రాజకీయం ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం !