ఢిల్లీ మద్యం కుంభకోణం మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్న కవితకు బెయిల్ లభించడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కవితకు బెయిల్ ఇవ్వడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని స్పష్టం చేసింది. దీంతో ఆమె కస్టడీ ముగిసిన తర్వాత తీహార్ జైలుకు పంపడం ఖాయంగా కనిపిస్తోంది. అరెస్టుపై సుప్రీంకోర్టు ఆంక్షలు లేవని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కవిత వేసిన ఆ పిటిషన్ పై ఎలాంటి తాత్కాలిక ఉపశమనం లేదని .. తరువాత 4, 5 సార్లు విచారణ వాయిదా పడిందని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
అంటే కవిత అరెస్టు చట్ట వ్యతిరేకంగా ఏమీ జరగలేదని సర్టిఫై చేయినట్లయింది. కవిత పై ఈడీ ఇంత కఠినంగా ఉండటానికి కారణం .. కేజ్రీవాల్ పై కేసు బలంగా ఉండాలనే అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ప్రధానంగా ముడుపులు అందింది సౌత్ లాబీ నుంచే. అందులో కీలక వ్యక్తి కవిత. అందర్నీ సిండికేట్ చేసి.. కవిత బినామీల ద్వారా వ్యాపారం చేశారు. ఇప్పుడు కవితపై కేసు బలంగా లేకపోతే.. కేజ్రీవాల్ పై కేసు కూడా తేలిపోతుంది. అందుకే.. కవితపైనా గట్టిగా ఈడీ కేసులు వాదిస్తోందని అంటున్నారు.
ప్రస్తుత పరిణామాలను చూస్తే.. కవితకు న్యాయస్థానాల్లో బెయిల్ దక్కడం అంత తేలికగా అయ్యే పని కాదన్న అభిప్రాయం న్యాయవాద వర్గాల్లో వినిపిస్తోంది. అయితే తాను మహిళనన్న కారణం చూపి.. బెయిల్ పొందే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఈ విషయంలో కవిత లాయర్లు ఎంత మేర సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది. కవిత లిక్కర్ కేసులో జైలుకెళ్లడం..తన పాత్రేమీ లేదని.. అసలు లిక్కర్ స్కాం అంటే ఏంటో తెలియదని వాదిస్తున్న కవితకు ఇబ్బందికరమే.