తెలంగాణ రాజకీయ ప్రముఖల ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 ప్రధాన నిందితుడిగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ ఐజీ ప్రభాకర్‌రావు పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. రెండో నిందితుడిగా డీఎస్పీ ప్రణీత్‌రావు, మూడో నిందితుడిగా హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, నాలుగు, ఐదో నిందితుడిగా మహబూబాబాద్ అదనపు ఎస్పీ బుజంగరావు, ఎస్ఐబీ అదనపు ఎస్పీ తిరుపతన్న లను చేర్చిన అధికారులు.. ఆరో నిందితుడిగా ప్రయివేటు వ్యక్తి పేరును పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో ప్రణీత్‌రావును అరెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులు అతనిచ్చిన వాంగ్మూలం మేరకు శనివారం రాత్రి బుజంగరావు, తిరుపతన్నలను కూడా అరెస్ట్ చేశారు.
ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కావటానికి రెండ్రోజుల ముందే మాజీ ఐజీ ప్రభాకర్‌రావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, ఒక ప్రయివేటు ఛానెల్ సీఈఓ శ్రవణ్‌కుమార్‌లు ఇక్కడి నుంచి చెన్నైకి వెళ్లి, అక్కడి నుంచి అమెరికాకు వెళ్లినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. దీంతో ఈ ముగ్గురి కోసం వేటను ప్రారంభించిన దర్యాప్తు అధికారులు..లుక్అవుట్ నోటీసులను జారీ చేశారు. జూబ్లిహిల్స్‌లోని ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి నివాసం సమీపంలోని ఒక భవనంలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన పరికరాలను అమర్చుకొనీ, ఆయన ఎన్నికల సమయంలో ఎవరెవరితో మాట్లాడేది, ఆయన రాజకీయ ఎత్తుగడలను ట్యాపింగ్ చేసి ప్రభాకర్‌రావుకు అందజేసేవారని గుర్తింారు.
అధికార పార్టీకి చెందిన కొందరు రాజకీయ ప్రముఖుల ప్రేరణ మేరకు తాము ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడినట్టు బుజంగరావు, తిరుపతన్నలు తెలిపినట్టు రిమాండ్ రిపోర్ట్‌లో దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. ఆ ప్రముఖుల పేర్లను దర్యాప్తులో భాగంగా రహస్యంగా ఉంచారు. ట్యాపింగ్ కేసు కేసీఆర్ లేదా కేటీఆర్ వద్దకు చేరడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. పక్కా ఆధారాలతో ట్యాపింగ్ దొరికిపోవడంతో… బయటపడటం అంత ఈజీ కాదని పోలీసులు వర్గాలు చెబుతున్నాయి.