తెలంగాణలో పోలీసుల ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టడం ఒకటి అయితే బంగారం వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కూడా నిఘా పెట్టి.. ట్యాపింగ్ చేసి వారి రహస్యాలు తెలుసుకుని బ్లాక్ మెయిలింగ్ దందా చేయడం కూడా జరిగిందని పోలీసుల వైపు నుంచి లీకులు వస్తున్నాయి. ఎవరైనా వ్యాపారులు ఫిర్యాదులు ఇచ్చారో లేదో స్పష్టత లేదు .. కానీ ఐటీ కారిడార్‌లో భారీగా భూములున్న సంధ్యా కన్వెన్షన్ ఓనర్ శ్రీధరరావు మాత్రం ఫిర్యాదు చేశారు.
గతంలో ఆయనపై చాలా కేసులు నమోదు అయ్యాయి. అందులో ఒకటి ఆయన స్వలింగసంపర్కుడని చేసిన ఆరోపణలతో పెట్టి కేసు కూడా ఉంది. ఇప్పుడు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇంకా ఎవరైనా ట్యాపింగ్ పై పోలీసుల్ని ఆశ్రయించారో లేదో ఇంకా బయటకు రాలేదు. కానీ ఇలాంటి దందాలు జరిగాయని.. పెద్ద ఎత్తున పోలీసు అధికారులు ఆస్తులు కూడబెట్టుకున్నారన్న ఆరోపణలు మాత్రం వస్తున్నాయి.
ఇప్పటికే ట్యాపింగ్ కేసులో కీలక వ్యక్తులు విదేశాలకు పారిపోయారు. వారిలో ముఖ్యుడు ప్రభాకర్ రావు అనే ఐపీఎస్ అధికారి. ఆయన కాంగ్రెస్ గెలిచిన రోజు సాయంత్రమే రాజీనామా చేశారు. తర్వాత అమెరికా పారిపోయారు. ఆయన తెలంగాణ పోలీసు శాఖలోని ఓ ఉన్నతాధికారికి ఫోన్ చేసి. మనం మనం పోలీసులం.. ఇళ్లల్లో సోదాలెందుకని అడిగినట్లుగా తెలుస్తోంది. ఏమైనా చెప్పాలనుకుంటే రాతపూర్వకంగా పంపించాలని ఆ అధికారి సమాధానం ఇచ్చారంటున్నారు. పరారీలో ఉన్న ముగ్గురు అధికారులపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వారిని విదేశాల నుంచి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.